దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షూటింగ్ కోసం వెళ్లిన ఓ స్టార్ హీరో ఆ వరదల్లో చిక్కుకుపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్‌లో వరద పోటెత్తుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్లు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బయటి ప్రాంతాల్నించి వచ్చినవాళ్లు చాలామంది జమ్ము కశ్మీర్‌లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ సైతం చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇటీవలే షూటింగ్ కోసం మాధవన్ లేహ్‌కు వెళ్లారు. అయితే మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మంచు కారణంగా రోడ్లు క్లోజ్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాంతో మాధవన్ హోటల్ రూమ్‌లోనే చిక్కుకుపోయారు.
ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హోటల్ గది బయట కురుస్తున్న వర్షం, మంచుతో కప్పుకుపోయిన ప్రకృతి దృశ్యాల్ని షేర్ చేశారు. గతంలో అంటే 17 ఏళ్ల క్రితం 3 ఇడియట్స్ చిత్రం షుూటింగ్ సమయంలో కూడా ఇలానే చిక్కుకుపోయినట్టు గుర్తు చేసుకున్నారు. 2008 ఆగస్టు నెలలో పాన్ గాంగ్ సరస్సు వద్ద షూటింగ్ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా మంచు కురవడంతో ఆగిపోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తనకు ఇంటికెళ్లిపోవాలని ఉన్నా..వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
ప్రస్తుతం ఈయన ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న దురంధర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. మాధవన్ నటించిన చివరి సినిమా ఆప్ జైసా కోయీ. వరదల కారణంగా చిక్కుకుపోయినప్పటికీ క్షేమంగా ఉన్నానని చెప్పాడు. వర్ధాలు తగ్గి, విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే ఇంటికి బయలుదేరతానని తెలిపాడు.