సంచలనం రేపిన పదేళ్ల సహస్రాణి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పదో తరగతి చదువుతున్న పక్కింటి విద్యార్ధే హంతకుడని తేలింది. 80 వేల కోసం అత్యంత పగడ్బందీగా ఈ హత్య చేసినట్టు తెలియడంతో అంతా నిర్ఘాంతపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో పదేళ్ల చిన్నారి సహస్రాణి హత్య కేసు ఐదు రోజుల తరువాత వీడింది. స్థానికుల సహకారంతో ఎట్టకేలకు కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పక్కింట్లో ఉండే పదో తరగతి విద్యార్ధి ఆ చిన్నారిని హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. వాస్తవానికి ఆ అమ్మాయి ఇంట్లో దొంగతనం చేసేందుకే ఇంట్లో చొరబడిన ..80 వేల రూపాయలు చొరీ చేశాడు. తిరిగొచ్చేస్తుండగా సహస్రాణి చూసింది. దాంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు. తరువాత గొంతు కోశాడు. బతకకూడదనే ఉద్దేశ్యంతో విచ్చలవిడిగా వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు.
దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలనే విషయంపై నిందితుడు వివరంగా ఓ కాగితంలో రాసుకున్నాడని పోలీసులు గుర్తించారు. సహస్రాణి హత్య జరిగిన రోజు సాయి ఆ ప్రాంతంలో సంచరించినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అటు స్థానికులు కూడా చెప్పిన సమాచారం క్రోడీకరించుకుని ఆ విద్యార్ధిని అదుపులో తీసుకున్న పోలీసులకు మొదట పొంతన లేని సమాధానాలిచ్చాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.
కేవలం పదో తరగతి చదువుతున్న విద్యార్ధి పగడ్బందీగా ప్లాన్ చేసి దొంగతనానికి పాల్పడటం, ముందు జాగ్రత్తగా కత్తి తీసుకెళ్లి…అడ్డొచ్చినవారిని చంపాలనుకోవడం చూస్తుంటే పోలీసులు నివ్వెరపోతున్నారు. అయితే ఆ డబ్బులు కచ్చితంగా ఇంట్లో ఎక్కడున్నాయనేది ఆ కుర్రోడికి ఎలా తెలిసిందనేది ఇప్పుడు మరో ప్రశ్నగా మారింది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదో యధాలాపంగా చేసిన చోరీ కాదని..పూర్తిగా ప్లానింగ్‌తో చేసిందని పోలీసులు ఆ లేఖ ఆధారంగా చెబుతున్నారు.
హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య సమయంలో ధరించిన నెత్తురుతో ఉన్న బట్టలు, దుప్పటి అన్నింటినీ పోలీసులు రికవర్ చేశారు. కేవలం తనంతట తానే ఈ హత్య చేశాడా లేక మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆపరేషన్ థెఫ్ట్ అంటూ లేఖలో ఆ కుర్రోడు రాసుకున్నది చూస్తే పోలీసులే కాదు అందరూ నిర్ఘాంతపోతున్నారు.
ఆ ఇంటిని బ్లాస్ట్ చేయాలనుకున్నాడా
మిషన్ డాన్ పేరుతో ఆ కుర్రోడు రాసిన లేఖలోని అంశాలు చూస్తే మతిపోతుంది. చాలా పక్కాగా , ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలనేది చాలా వివరంగా రాసుకున్నాడు. ఇంటికి వెళ్లాలి, గ్యాస్ , టేబుల్ రెండు తీసుకోవాలి, గ్యాస్ ఫైర్ చేయాలి, కత్తితో కట్ చేయాలి అంటూ పొడి పొడిగా రాసుకున్నాడు. చివరిగా గ్యాస్ లీక్ చేయాలని రాయడం వెనుక అర్ధం ఏంటనేది తెలియడం లేదు. ఒకవేళ చివరిగా ఆ ఇంటిని బ్లాస్ట్ చేసే ఉద్దేశ్యం ఉందా అనేది తెలియాల్సి ఉంది.