సొంత ఇల్లు నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికి ఓ కల. కానీ.., రోజురోజుకి పెరిగిపోతున్న సిమెంట్, ఇసుక, ఇటుక ధరల కారణంగా సామాన్యులు తమ సొంత ఇంటి ఆశని చంపుకుంటున్నారు. ఈ రోజుల్లో కనీసం 10 లక్షలు చేతిలో లేకుండా ఇంటి నిర్మాణం అసాధ్యం అయిన పని. ఆ 10 లక్షలకి కూడా ఓ సాధారణ ఇల్లు వస్తుంది అంతే. కానీ.., మీకు 100 గజాల స్థలం ఉంటే చాలు. ఆ స్థలంలోనే కేవలం రూ.2 లక్షలకే లగ్జరి హౌస్ నిర్మించుకే అవకాశాన్ని కల్పిస్తున్నారు మల్కాజిగిరికి చెందిన విజయవర్ధన్ యాదవ్.
నిజానికి ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్, ఇసుక, ఇటుక, కూలీ ఖర్చే ఎక్కువ అవుతుంది. కానీ.., తాను నూతనంగా తీసుకొచ్చిన ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో అసలు వీటి అవసరమే ఉండదు అంటున్నాడు విజయవర్ధన్. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ.., లక్షలు గడిస్తున్నవిజయవర్ధన్ ఆ జాబ్ ని వదులుకుని మరీ ఈ బ్రిక్స్ తయారీలో నిమగ్నమయ్యాడు. సొంతంగా టఫీ పేరిట కంపెనీ పెట్టి.. ఈ తరహా ఇటుకలను తయారు చేస్తున్నాడు విజయవర్ధన్.
నిజానికి ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ అనేది కొత్త పద్ధతి ఏమి కాదు. చాలా దేశాల్లో ఇంటి నిర్మాణం ఇలానే జరుగుతోంది. ఇలా ఇల్లు కట్టుకోవడం ద్వారా పని దినాలు తగ్గుతాయి. కూలీల అవసరం తగ్గుతుంది. తద్వారా.. బోలెడంత ఖర్చు మిగులుతుంది. ఇక ఇంటి దృఢత్వం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు. కంకర, సిమెంట్, ఇసుక లేకుండా కేవలం బ్రిక్స్ లాక్ చేసి పెడితే దృఢత్వం వస్తుందా అని..? ఈ లాకింగ్ బ్రిక్స్ తయారీ సమయంలోనే కంకర, సిమెంట్, ఇసుక, యాష్ వంటివి అన్నీ మిక్స్ చేస్తారు. కాబట్టి ఈవిషయంలో భయపడాల్సిన పని లేదు.
మల్కాజిగిరి, కొంపల్లి, సైనిక్‌పురి ప్రాంతంలో ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్‌తో పలు నిర్మాణాలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో వీటి వాడకం భారీగా పెరగనుంది. దీంతో.., తెలుగు రాష్ట్రాలలో మరిన్ని యూనిట్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాడు విజయవర్ధన్. మరి ఇంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయితే సామాన్యులకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఈ విషయంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి.