భారత దేశంలో ఎన్నో సాంప్రదాయలు హిందువులు తూ.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభం అయ్యింది.. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకం. పురాణాల కథనం ప్రకారం ఈ మాసంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. కార్తిక మాసం అంటే శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో సందడి చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కార్తిక మాసం సందడి మొదలైంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.
కార్తీక మాసంలో ఒక వైపు ఆద్యాత్మిక వాతావరణం.. మరోవైపు వనభోజనాల సందడి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వనభోజనాలకు సంబంధించిన ప్రస్తావన మన హిందూ ధార్మిక గ్రంథాల్లో ‘కార్తీక పురాణం’ప్రస్తావించబడింది. కార్తీక పౌర్ణమి రోజును మునులు సూత మహర్షి అధ్వర్యంలో వనభోజనాలు చేసినట్లు.. ఒక ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని ప్రతిష్టించి పూజ చేసి.. గోవింద నామస్మరణంతో పాటు ఓం నమఃశివాయ అంటూ షోడశోపచారాలతో పూజలు నిర్వహించి ఆ తర్వాత వనభోజనాలు చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో పాటు వనభోజనాలు కూడా చేయడం ఆనవాయితీగా వస్తుంది.
కార్తీక మాసం అంటే వర్షాకాలం ముగిసిన తర్వాత వస్తుంది.. ఆ సమయంలో వానలు, ఎండలు లేకుండా ప్రకృతి ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో బయటికి వెళ్లి వనభోజనాలు తింటే ఆనందకరమైన అనుభూతి కలుగుతుందని అంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే చాలా మంది పిక్ నిక్.. వనభోజనాలు ఎక్కడ చేసుకోవాలా అన్న విషయంపై ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే వారు కార్తీక మాసం పురస్కరించుకొని వనభోజనాల కోసం బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్లాన్ చేస్తుంటారు. ఈ మద్య చాలా మంది రీసార్ట్స్ లాంటివి బుకింగ్ చేసుకొని అక్కడే వనభోజనాలు కానిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో మందు సేవించి.. మాంసాహారం తినడం లాంటివి చేస్తున్నారు. ఆ సమయంలో దైవ చింతన అనేదే ఉండకుండా పోతుంది. ఏదో ఫార్మాలిటీస్ కోసం వనభోజనాలు చేసి ఎంజాయ్ చేసి వచ్చినట్లు అవుతుందని అంటారు.
మన పూర్వికులు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఏదైనా పచ్చటి ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి.. అక్కడ శ్రీమహావిష్ణు ప్రతిమను ప్రతిష్టించుకొని పూజ చేసి తర్వాత వనభోజనాలు చేయాలని అంటారు. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లి ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణు ప్రతిమ ప్రతిష్టించి పుష్పాలతో పూజ చేస్తే అశ్వమేధ యాగాల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నారు. పచ్చని చెట్ల కింద, అహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మద్య వనభోజనాలు చేయడం వెనుక దైవ భక్తి , ఆద్యాత్మిక భావన ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పటి కల్చర్ లో మాత్రం కార్తీక మాసంలో వనభోజనాలు అంటే కేవలం విందులు.. వినోదాల కోసమే అన్నరీతిలో సాగుతుంది. వనభోజనాల పేరిట మాంసాహారంతో విందులు.. వినోదాలు లాంటి తప్పులు చేయవొద్దని.. అది పాపం అని పెద్దలు అంటున్నారు.
కార్తీక వనభోజనాల మరో ముఖ్య ఉద్దేశ్యం ఆ సమయంలో బంధుమిత్రుల మద్య సమైక్యత పెరుగుతుంది. ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకునే అవకాశం ఉంటుంది. తెచ్చుకున్న ఆహార పదార్దాలు ఒకరికొకరు పంచుకోవడం భిన్న రుచుల అనుభూతి తిన్న అనుభూతి కలుగుతుంది. నిత్యం ఏదో ఒక పనిపై ఎంతో ఒత్తిడితో ఉండే దైనిందిన జీవితంలో వచ్చే చిరాకులు, టెన్షన్స్ అన్నింటికీ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా వనభోజనాల్లో పిల్లా, పెద్దలు ఎంతో ఆనందాన్ని పొందుతారు. అందుకే వనభోజనాలకు సమీప ఉద్యాన వనాలు, పచ్చని తోటల్లో.. దేవాలయాల సమీపంలో దైవ చింతనతో చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని అంటారు.