జల్సాలు, విలాసాల కోసం నేటి యువత పెడదోవ పడుతోంది. ఈజీ మనీ కోసం మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంది. దీని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నేర ప్రవృత్తిలో ఆరి తేరుతున్నారు. సామాన్యుడూ కాదూ ఓ చిన్నపాటి సెలబ్రిటీ మోసాలకు పాల్పడి.. పోలీసులకు చిక్కాడు.
మోసం చేయడం ఇటీవల పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు నేటి యువత. దీని కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. కష్టపడటం మానేసి జల్సాల కోసం విచ్చలవిడితననానికి అలవాటు పడుతున్నారు. దొరకనంత వరకు తల్లిదండ్రులు, స్నేహితులు వద్ద కలరింగ్ ఇస్తూ లైప్ ఎంజాయ్ చేస్తుంటారు. దొరికిపోయినా కూడా ఏ మాత్రం బెరుకు భయం ఉండటం లేదు. వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని వినియోగించుకుని బయటకు వచ్చి మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు. ఇలా సామాన్యుడు చేస్తుంటే పెద్ద చర్చకు దారి తీయదు కానీ ఓ సెలబ్రిటీ చేస్తే అది వార్తే.
అతడో క్రికెట్ ఆటగాడు. రంజీలే కాకుండా ఇండియా బీ టీమ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోనూ ఆడాడు. ఆటగాడిగా మంచి పేరు తెచ్చుకున్న అతడు మోసాలకు మరిగాడు. ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రుల పేరు చెప్పి వ్యాపార వేత్తల నుండి డబ్బులు దోచుకోవడం అలవాటు చేసుకున్నాడు. చివరికీ అతడి బండారం బయట పడి ఊసలు లెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అతడే మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు. యువ క్రికెటర్ల కోసం స్పానర్ షిప్ ఇవ్వడంటూ పలువుర్ని మోసం చేసిన కేసులో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఏని మాట్లాడుతున్నానని, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు చెప్పి పలుమార్లు మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. బాధితుల జాబితా చాలానే ఉందని తేలింది.
కొద్ది రోజుల క్రితం ముంబయిలోని ఓ వ్యాపారికి ఫోన్ చేసి తాను ఆంధ్రప్రదేశ్ సీఎం పీఏను మాట్లాడుతున్నాని, మీరు ఓ పని చేసిపెట్టాలంటూ మాటలు కలిపాడు. ఆంధ్రాకు చెందిన రింకీ అనే ఫ్లేయర్ మంచిగా ఆడుతున్నాడని, అతడికి స్పాన్సర్ చేయాలంటూ విన్నవించాడు. రూ. 12 లక్షలు తాను చెప్పిన ఖాతాలో వేయండని నాగరాజు మాయ మాటలు చెప్పాడు. ఏపీ సీఎం పిఏ అనగానే వెనక ముందు ఆరా తీయని వ్యాపారి చెప్పిన ఖాతాలో ఆ నగదును జమ చేశాడు. ఆ తర్వాత, స్పాన్సర్‌షిప్ గురించి ఆరా తీస్తే.. ఆ ఫోన్ నంబర్ పని చేయడం లేదని తేలింది. మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఏపీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఇంతలో మరో కార్పొరేట్ సంస్థను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు నాగరాజు. మళ్లీ అదే కట్టు కథ (వర్థమాన క్రికెటర్లకు స్పాన్సర్ షిప్ ఇవ్వాలని) వినిపించాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీతో తనకు గుర్తింపు, అనుబంధం ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, సదరు సంస్థకు ఇ మెయిల్ చేశాడు. ఇప్పుడు కూడా రూ. 12లక్షలు డిమాండ్ చేశాడు. ఆ కంపెనీ కన్ఫర్మేషన్ కోసం క్రికెట్ బోర్డుకు మెయిల్ చేయడంతో నాగరాజు బండారం బయట పడింది. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోని దిగిన పోలీసులు ఫోన్ ట్రాక్ చేసి శ్రీకాకుళంలోని యావారి పేటలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే విచారణలో నాగరాజు అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడింది. నాగరాజు 2012-14 మధ్య ఆంధ్రా రంజీకి ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకూ ఆడాడు. 2016 -18 మధ్య భారత బీ టీమ్‌కూ ఆడాడు. అతడిపై ఏపీ, తెలంగాణలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి కేటీఆర్ పేరు వాడుకుని పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. 60 కార్పొరెట్ కంపెనీల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఖాతాలను స్థంభింప చేశారు.