మరి కొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజిన్ 9 ప్రారంభం కానుంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరనేది పూర్తిగా క్లారిటీ రాకపోయినా కొందరి పేర్లు మాత్రం విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో అప్‌డేట్ వచ్చింది. క్రేజీ హీరో పేరు విన్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు టీవీ స్క్రీన్‌పై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు. సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ చేసే ఈ రియాల్టీ షో కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈసారి కొత్తగా ఐదుగురు సామాన్యులను ఎంపిక చేయనున్నారు. ఆ ఐదుగురినీ ఎంపిక చేసే ప్రక్రియ నడుస్తోంది. మరోవైపు ఈసారి డబుల్ హౌస్ డబుల్ ధమాకా అంటూ నాగార్జున ఆసక్తి రేపుతున్నారు. ఐదుగురు సామాన్యులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ షో కమెడియన్లు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు.
ఈ అందరితో పాటు ఇప్పుడు ఓ హీరో పేరు విన్పిస్తోంది. ఇతడు టాలీవుడ్‌లో ఒకప్పటి హీరో. ఇప్పుడు కొన్ని సినిమాల్లో విలన్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్‌లో నిర్మించిన సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అన్నయ్య, ఆనందం, శివరామరాజు, యువరాజు వంటి సినిమాల్లో నటించాడు. చాలా కాలం గ్యాప్ తరువాత ఇటీవలే ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇంతకీ ఈ హీరో మరెవరో కాదు వెంకట్. నాగార్జునకు మంచి స్నేహితుడు. మొదటి సినిమాతోనే నాగార్జునతో స్నేహబంధం ఏర్పడింది. ఇప్పుడు నాగార్జున కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టనున్నాడని తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే ఈసారి బిగ్‌బాస్ షోకు కాస్త సినీ గ్లామర్ రావచ్చు.