ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా కేన్సర్ పీడితులకు బిగ్ రిలీఫ్ లభించనుంది. పేదలకు తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్సను అందించే బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి త్వరలో ఏపీలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేన్సర్ వ్యాధిగ్రస్థులుకు ముందుగా వెళ్లేది ఈ ఆసుపత్రికే. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి త్వరలో ఏపీలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇవాళ భూమి పూజ జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు గ్రామ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కేన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణతో పాటు వైద్యపరంగా సహకరించనున్న డాక్టర్ నోరి దత్రాత్రేయుడు, డాక్టర్ పోలవరపు రాఘవరావు, డాక్టర్ గెడ్డం దశరథ రామిరెడ్డి భూమిపూజలో పాల్గొన్నారు.
దాదాపు 4 వందల కోట్ల వ్యయంతో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. వేయి పడకల ఆసుపత్రిగా ఉంటుంది. మొదటి ఏడాదిన్నరలో మొదటి దశ పూర్తి చేసిన రోగులకు అందుబాటులో తీసుకురానున్నారు. బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తుంటుంది. మొత్తం వ్యవహారాలు బాలకృష్ణ చూస్తుంటారు. నందమూరి బాలకృష్ణ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ఆసుపత్రికే కేటాయిస్తుంటారని సమాచారం.