ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. వైసీపీ నేతలు.. ప్రతిపక్షనేత చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని పలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి.. టీడీపీ పగ్గాలు లాక్కున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. అలానే తన కుమారుడు లోకేశ్ ను సీఎం చేయడం కోసమే.. జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా తరచూ వైసీపీ, టీడీపీ నేతల నోర్లలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తునే ఉంది. తాజాగా వైసీపీ సీనియర్ నాయకురాలు, నందమూరి లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు దేశం పార్టీ, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటంపై ‘తెలుగు-సంస్కృత అకాడమీ’ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్డల్ క్యాన్సర్ డే సందర్భంగా ఓ ప్రవేటు ఆస్పత్రికి ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. కార్యక్రమం అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా ప్రయోజనం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన ఎంట్రీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని ఆమె తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా ప్రజల్లో ఉంటే ఐదేళ్ల తరువాత అయిన ఎన్టీఆర్ కు అవకాశం ఉండొచ్చు అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా ఏమి చేయలేరని ఆమె అన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ టీడీపీలోకి ఇప్పుడు వచ్చినా.. ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించి.. ఐదేళ్ల పాటు పూర్తిగా పొలిటికల్ ట్రైనింగ్ పొందుతూ..ప్రజలతో మమేకం అవ్వాలి. జగన్ మోహన్ రెడ్డి లాగా జనంతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని ముందుకు పోతే మంచిదని లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు.
ఆమె వ్యాఖ్యలు అలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చాలా కాలం నుంచే చర్చ జరుగుతూనే ఉంది. టీడీపీ అసలైన వారసులు నందమూరి కుటుంబమేనని, వారికే టీడీపీ పగ్గాలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేశారు. టీడీపీని బతికించాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని చర్చ సాగుతూ వచ్చింది. ఆయన రాజకీయ అరంగ్రేటం చేస్తే బాగుంటుందనే అనేవారు లేకపోలేదు. నందమూరి కుటుంబ సభ్యులను చంద్రబాబు వాడుకుంటున్నారని అనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఇలా నిత్యం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తుంటాయి. తాజాగా లక్ష్మీపార్వతీ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి.. లక్ష్మీపార్వతి చేసిన ఈ వాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.