చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగులపై ఓ రకమైన నెగెటీవ్ అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ.. తమ పిల్లలను మాత్రం పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్స్ లో చదివిస్తుంటే.. ఇక సామన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఎలా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఆఫీసర్లు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాలల్లో జాయిన్ చేస్తున్నారు. తాజాగా ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ నవ్య.. తన కుమారుణ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి.. నలుగురికీ ఆదర్శంగా నిలిచారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నవ్వ పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు శ్రీకర్ ప్రతీక్ ఆరో తరగతి చదువుతున్నాడు. అతణ్ని.. స్థానికంగా ఉన్న ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గవర్నమెంట్ ఎయిడెట్ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్ అధికారిణి అయ్యానన్నారు. ఏపీ సర్కారు విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటానికి కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని ఆమె తెలిపారు. ప్రజలు ప్రభుత్వ స్కూల్ పై నమ్మకం రావాలంటే ముందుగా తమ పిల్లలను జాయిన్ చేసి నలుగురికి ఆదర్శంగా ఉండాలని ఆమె తెలిపారు.
పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేసేందుకు మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు పోటీపడుతున్న ఈ రోజుల్లో.. ఓ ఐఏఎస్ అధికారిణి.. తన కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించడం అభినందించదగ్గ విషయమని పలువురు ఆమెను ప్రశంసించారు. ఆమె తల్చుకుంటే లక్షలు పెట్టి ఏదైన ఓ కార్పోరేట్ స్కూల్ లో జాయిన్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత చదువు, ఇతర సౌకర్యలపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి, లక్షల్లో డబ్బులు ఖర్చు చేయడం ఎందుకనేది ఆమె ఉద్దేశంగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.