మందుబాబులకు ఫుల్ కిక్ లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి మందు షాపుల వద్దే తాగవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి లిక్కర్ షాపుల వద్దే తాగేందుకు అనుమతి లభించనుంది. వైన్ షాపుల వద్ద తిరిగి పర్మిట్ రూమ్స్ రానున్నాయి. కొత్తగా వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్‌కు అనుమతి ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్స్‌పై గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేసింది. ప్రత్యేకంగా జీవో నెంబర్ 273 జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 273 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఏ4 లిక్కర్ షాపులకు పర్మిట్ రూమ్స్ పెట్టుకునేందుకు అనుమతులు లభిస్తున్నాయి. ఒక్కొక్క షాప్ పర్మిట్ రూమ్ పెట్టుకునేందుకు ఏడాదికి 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలి. రెవిన్యూ టర్నోవర్ 55 లక్షలుంటే ఏడాదికి 5 లక్షలు చెల్లించాలి. అదే రెవిన్యూ ఏడాదికి 65-85 లక్షలుంటే 7.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి అనుబంధంగా కొన్ని నిబంధనలు చేర్చారు.
పర్మిట్ రూమ్స్‌లో మందు తాగేందుకు సీల్డ్ బాటిళ్లకే అనుమతి ఉంటుంది. అంటే బార్ తరహాలో లూజ్ అమ్మకాలు జరపకూడదు. పర్మిట్ రూమ్ గరిష్టంగా 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండాలి. దీనికితోడు శానిటేషన్, హ్యాండ్ వాష్, తాగునీటి సౌకర్యం తప్పనిసరి. తాగునీరు పెట్టని పర్మిట్ రూమ్స్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అనధికారికంగా నడుస్తున్న పర్మిట్ రూమ్స్‌పై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలి. నిర్దిష్ట ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి. పర్మిట్ రూమ్‌లో మందుబాబుల మధ్య ఘర్షణలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
కొత్తగా పర్మిట్ రూమ్స్‌కు అనుమతి ఇవ్వడం వల్ల మందుబాబులు ఎక్కడపడితే అక్కడ తాగడాన్ని అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అంతేైకాకుండా మద్యం వ్యాపారంలో నాణ్యత, భద్రతతో పాటు బాధ్యతాయుత వ్యాపార నిర్వహణ ఉంటుంది. ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.