ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎనర్జీ గురించి ఫ్యాన్స్ కి తెలిసిందే. మొన్నటివరకు సాఫ్ట్ లవర్ బాయ్ రోల్స్ చేసిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో పంథా మార్చి మాస్ సినిమాలు లైనప్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ రామ్ లోని మాస్ హీరోని బయటపెట్టగా.. అదే మాస్ ని రెడ్ మూవీలో ట్రై చేశాడు.. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఎప్పటినుండో రామ్ కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పి తమిళ డైరెక్టర్ లింగుసామీతో ‘ది వారియర్’ మూవీ చేశాడు. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ఆది పినిశెట్టి విలన్ గా నటించడంతో ‘ది వారియర్’ మూవీపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి విడుదలకు ముందే సాంగ్స్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన `ది వారియర్`.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సత్య(రామ్ పోతినేని) మెడిసిన్ చదివి డాక్టర్ గా కర్నూల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో డ్యూటీలో చేరతాడు. అయితే.. అప్పటికే కర్నూల్ జిల్లా అంతా గురు (ఆది పినిశెట్టి) కంట్రోల్ లో ఉంటుంది. వరుస హత్యలు, సెటిల్ మెంట్స్ తో రౌడీగా ఎదిగిన గురుకు ఎదురు ఎవరొచ్చినా చంపేస్తుంటాడు. ఈ క్రమంలో డాక్టర్ సత్యకు లోకల్ రేడియో జాకీ విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ నేపథ్యంలో అనుకోని కొన్ని సంఘటనల వలన డాక్టర్ సత్యకు, గురుకి వైరం ఏర్పడుతుంది. కట్ చేస్తే.. కొంతకాలం తర్వాత కర్నూల్ జిల్లాకు పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తాడు సత్య. మరి డాక్టర్ సత్య పోలీస్ ఎందుకయ్యాడు? ఎలా అయ్యాడు? గురుతో వైరం సత్య లైఫ్ ని ఎలాంటి మలుపులు తిప్పింది? చివరికి విజిల్ మహాలక్ష్మి, సత్య ఎలా ఒక్కటయ్యారు? అనేది తెరపైనే చూడాలి.
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ది వారియర్ మూవీతో మరోసారి తనలోని మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ తో అటు డాక్టర్ గా, ఇటు పోలీస్ గా రెండు వేరియేషన్స్ ని చాలా బాగా చూపించాడు రామ్. డాక్టర్ గా సాఫ్ట్ గా కనిపించిన రామ్.. పోలీస్ అయ్యాక వీరంగం సృష్టించాడు. తన పాత్ర వరకూ వందశాతం ఎఫర్ట్స్ పెట్టేసాడు రామ్. ఈ మూవీ మొదలవ్వడమే కలర్ అనే కూల్ సాంగ్ తో మొదలైంది. అలా రామ్ సత్య క్యారెక్టర్ ని సాఫ్ట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు.
ఇక డాక్టర్ గా డ్యూటీ కర్నూల్ హాస్పిటల్ లో పడిందని అక్కడికి తల్లి(నదియా)తో కలిసి వెళ్లడం.. వెళ్ళగానే హీరోయిన్ విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి) క్యారెక్టర్ ని పరిచయం అవుతుంది. ఉప్పెన, బంగార్రాజు సినిమాలతో హిట్స్ లో ఉన్న కృతి శెట్టి ఇంట్రడక్షన్ ఇందులో కూడా బాగుంది. కానీ.. కృతి క్యారెక్టర్ ని రెగ్యులర్ లింగుసామీ స్టైల్ లోనే ఉంటుంది. కాకపోతే లింగుసామీ డిసైన్ చేసే హీరోయిన్ క్యారెక్టర్ లో కొత్త హీరోయిన్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. లింగుసామీ సినిమాల్లో హీరోయిన్స్ హీరోలను డామినేట్ చేస్తుంటారు. ఇక్కడ హీరో డాక్టర్ కాబట్టి సాఫ్ట్ గా హీరోయిన్ని రేడియో జాకీ రోల్ లో చూపించారు. ఇక గ్యాప్ లేకుండా ఏదోకటి వాగుతూనే ఉంటుంది అన్నమాట.
హీరో కర్నూల్ లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆ ఏరియా విలన్ గురు(ఆది పినిశెట్టి) పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు లింగుసామీ. గురు పాత్రలో ఆది పినిశెట్టి యాక్టింగ్, యాటిట్యూడ్ అన్నీ పీక్స్ లో డిసైన్ చేశారు. అలాగే ఆది డైలాగ్ డెలివరీ కూడా ఇంటెన్స్ గా ఉంది. ఆదిని ఇదివరకు సరైనోడు సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చూసాం. చాలా గ్యాప్ తర్వాత ఆ స్థాయి విలన్ క్యారెక్టర్ ని ఇచ్చాడు లింగుసామీ. ఇక కరుడుగట్టిన విలన్ గురు పాత్రకు ఆది నూరుశాతం న్యాయం చేశాడు. అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ రోల్ అవుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఓవైపు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, మరోవైపు విలన్ అరాచకాలు సపరేట్ గా చూపించారు.
ఇంటర్వెల్ లో విలన్ గురు.. డాక్టర్ సత్యను చావగొట్టి కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర వేలాడదీస్తాడు. అక్కడి నుండి హీరో ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా సినిమాలో రామ్, ఆది ఎదురుపడిన సీన్స్ అన్నీ మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అనిపిస్తాయి. కానీ.. సినిమా అంతా లింగుసామీ పాత సినిమాలు పందెంకోడి తాలూకు సన్నివేశాలు కనిపిస్తాయి. అదిగాక రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే వారియర్ కూడా సాగడం జరిగింది. అక్కడక్కడా విలన్ కి హీరో వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలలో గబ్బర్ సింగ్, పోకిరి, యముడు సినిమాల టైప్ సీన్స్ తారసపడతాయి.
ఫస్ట్ హాఫ్ మాములుగా సాగినప్పటికీ, సెకండాఫ్ లో ఫుల్ మాస్ ఎలిమెంట్స్ రాసుకున్నాడు దర్శకుడు. పోలీస్ సత్యగా రామ్ ఇంట్రడక్షన్ సీన్.. సింగం 3లో సూర్య ఎంట్రీని తలపిస్తుంది. ఇక అక్కడినుండి విలన్ గురు అరాచకాలను హీరో ఎలా మట్టుపెట్టాడు? అనేది సెకండాఫ్. సెకండాఫ్ అంతా సీరియస్ గా సాగుతుంది. మాస్ సినిమా అనేసి కామెడీ లేకుండా ప్లాన్ చేశారు. కానీ.. మరీ సీరియస్ గా ఉన్నా కథాకథనాలు ఇంటరెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉండాలి. కానీ.. ఇందులో కామెడీ లేదు.. స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ మిస్ అయ్యింది. అంతేగాక రెగ్యులర్ సినిమాలలో కనిపించే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉండేసరికి థ్రిల్ కి గురయ్యే అవకాశం లేకుండా పోయింది.
ఒక్కటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్పవచ్చు. హీరో రామ్ ఫ్యాన్స్ కి, విలన్ గా నటించిన ఆది ఫ్యాన్స్ కి వారియర్ మూవీ పండగే. ఎందుకంటే.. వీరిద్దరినీ ఇదివరకు చూడని విధంగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు.. కథాకథనాలలో కొత్తదనం లేకుండా తీయడం గమనార్హం. కానీ.. క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయి. లింగుసామీ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఓ పందెంకోడి, ఆవారా, పందెంకోడి 2 లాంటి యాక్షన్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ.. వారియర్ లో లింగుసామీ మ్యాజిక్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఇక సినిమాలో బ్రహ్మాజీ, నదియా, పోసాని, విలన్ భార్యగా అక్షర గౌడ.. తదితరులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. మొత్తంగా పవర్ ఫుల్ పోలీసోడు, పవర్ ఫుల్ విలన్ మధ్య జరిగిన వార్ ఈ వారియర్.
ఇక దర్శకుడు లింగుసామీ తనవంతుగా రామ్ లోని మాస్ ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్ లో డాక్టర్ కం పోలీస్ అయినటువంటి పోలుసులకు ఎవరు సినిమాను అంకితం చేయడం బాగుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అక్కడక్కడా విజిల్స్ వేయిస్తాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ అనే చెప్పాలి. సాంగ్స్ పరవాలేదు. కానీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సుజిత్ వాసుదేవ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ది వారియర్ ని నిర్మించడం విశేషం. మరి మాస్ ఫ్యాన్స్ కి ది వారియర్ ఫీస్ట్ అవుతుంది.