సాధారణంగా మనకు గాయం అయితే ఏం చేస్తాం?.. గాయాన్ని బట్టి దానికి చికిత్స చేయించుకోవాలని చూస్తాం. గాయం పెద్దదయితే డాక్టర్ దగ్గరకు వెళతాం. కానీ, వీధి జంతువుల పరిస్థితి అలా ఉండదు. గాయం అయితే ఆ నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోవాలి. గాయం తీవ్రతను బట్టి అవి ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వస్తుంది. కానీ, కొన్ని వీధి జంతువులు మాత్రం తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమ గాయానికి చికిత్స చేయించుకోవటానికి ఏకంగా ఆసుపత్రికే వెళుతున్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో చాలా జరిగాయి. తాజాగా, కూడా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వీధి పిల్లి తన కాలుకు అయిన గాయానికి చికిత్స చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఓ మనిషిలా ప్రవర్తించి చికిత్స చేయించుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం టర్కీకి చెందిన ఓ వీధి పిల్లి కాలికి గాయం అయింది.
ఆ గాయం దాన్ని బాగా బాధించినట్లు ఉంది. దీంతో అది నేరుగా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ కుంటు, కుంటూ కలయ తిరిగింది. చివరకు ఓ రూములోకి వెళ్లింది. దాన్ని గమనించిన అబుజర్ ఒజ్దమీర్ చికిత్స చేయటానికి సిద్ధం చేశాడు. గాయాన్ని బాగా శుభ్రం చేసి, కట్టు కట్టాడు. ఆ పిల్లి కూడా ఓ మనిషిలాగా ఏలాంటి గొడవ చేయకుండా కట్టు కట్టించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై నర్సు అబుజర్ ఒజ్దమీర్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఆసుపత్రిలో పని చేసుకుంటూ ఉండగా.. ఓ పిల్లి అక్కడికి వచ్చింది. అది అటు ఇటు కుంటు, కుంటూ తిరుగుతోంది. నేను దాన్ని పట్టుకుని చూశాను. కాలు విరిగి ఉంది. దీంతో దానికి చికిత్స అందించాను. కొద్ది సేపు అక్కడే ఉంచి పంపేశాను’’ అని తెలిపాడు.