బంగాళాదుంప లేదా ఆలూ గడ్డ అంటే ఇష్టం లేనివాళ్లుండరు బహుశా. ఎందుకంటే చిప్స్, ఫ్రెంచ్ ఫ్లైస్, ఫ్రై ఇలా అందరికీ నచ్చిన వెరైటీలు చాలానే ఉంటాయి. అయితే అందరికీ ఇష్టమైన ఆలూ గడ్డ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ అంశం వెలుగు చూసింది. ఇది వింటే మీరు నమ్మలేరు కూడా.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టంగా లేక ఎక్కువమంది తినేది బంగాళదుంపే. అందుకే ఎక్కువగా పండించే పంటల్లో మూడో స్థానంలో ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన ఆలూ గడ్డ లేక బంగాళదుంప అన్ని రకాల వాతావరణంలో పండేది కావడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అయితే ఈ ఆలూగడ్డ అలియాస్ బంగాళదుంప గురించి ఎవరికీ తెలియని, షాకింగ్ అంశం ఒకటి వెలుగు చూసింది. మనం అత్యంత ఇష్టంగా తినే బంగాళదుంప ఆవిష్కరణ ఎలా జరిగిందనేది ఆశ్చర్యం కల్గిస్తోంది. ఎప్పుడో 9 మిలియన్ ఏళ్ల క్రితం ప్రకృతి సహజసిద్ధంగా జరిగిన జన్యు వివాహం లేదా సంకరీకరణ కారణంగా ఆలూ గడ్డ ఉద్భవించిందట. ఈ విషయాన్ని షెన్ జెన్ అగ్రికల్చరల్ జెనోమిక్స్ ఇనిస్టిట్యూట్, చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, లాన్ జౌ యూనివర్శిటీ పరిశోదకులతో పాటు యూకే కెనడా సైంటిస్టులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
ఆలూ గడ్డ పుట్టింది టొమాటో నుంచా…షాకింగ్‌గా లేదా
బంగాళదుంప మూలాలేంటో తెలుసుకునే క్రమంలో ఈ ఆసక్తి కల్గించే అంశాలు వెలుగు చూశాయి. బంగాళదుంప మొక్క ఎటుబెరోసమ్ జాతికి సమానంగా ఉండి ఫైటోజెనిక్ విశ్లేషణ చేసినప్పుడు టొమాటోతో దగ్గర సంబంధం ఉన్నట్టు తేలింది. మరింత లోతైన అధ్యయనం కోసం 101 జన్యువులు, 349 శాంపిల్స్, 56 రకాల దుంప జాతులను పరిశీలించి డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆలూ గడ్డ ఎటుబెరోసమ్-టొమాటో జాతికి చెందిందిగా తేలింది. ఈ రెంటికి పుట్టిన హైబ్రిడ్ సంతానం బంగాళదుంప. అంటే మనం ఇష్టంగా తినే బంగాళదుంపకు తల్లి టొమాటో. మిలియన్ ఏళ్ల క్రితం జరిగిన ఈ సంకరీకరణ ప్రకృతి సహజసిద్ధంగా జరిగిందే. నమ్మలేని విధంగా ఉన్నా ఇదిప్పుడు ముమ్మాటికీ నిజం.