కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పెద్దలు అంటుంటారు. సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇంట్లో విద్యుత్ సదుపాయం లేకపోతే వీధి బయట విద్యుత్ దీపాల కింద కూర్చుని చదువుకున్నటువంటి అంబేద్కర్ లాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వారూ ఉన్నారు. వీరి కఠోర శ్రమ వీరి జీవితాల్లోని కాదు, ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతుంది. ఇలాంటి మహనీయుల మాదిరి ఓ యువతి కూడా పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోయినా సరే వేరే మార్గం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె ఎవరో కాదు నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్ వాడకు చెందిన సతీష్ కుమార్, అనురాధల కూతురు హారిక.
ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. హారికకు ఈశ్వర్ అనే తమ్ముడు ఉన్నాడు. హారిక పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. అయితే డాక్టర్ అవ్వాలనేది హారిక కోరిక. అయితే కోరిక ఉంటే సరిపోతుందా? స్థోమత ఉండాలి కదా. డాక్టర్ అవ్వడానికి లక్షల్లో ఫీజులు. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి. అది చదవాలంటే నీట్ కోచింగ్ తీసుకోవాలి. నీట్ కోచింగ్ కే తన దగ్గర డబ్బులు లేవు. ఇక డాక్టర్ ఎలా అవుతుంది? కానీ ఆమె నిరుత్సాహపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగోలా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంది. స్థోమత లేక నీట్ కోచింగ్ కు వెళ్లలేకపోయింది. కానీ ఎలా అయినా డాక్టర్ అవ్వాలన్న తన సంకల్పం ముందు ఓటమి కూడా తల వంచింది.
ప్రతి రోజూ యూట్యూబ్ లో ఎంబీబీఎస్ క్లాసులకు సంబంధించిన వీడియోలు చూసి పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. ఆ యూట్యూబ్ లో నేర్చుకున్న జ్ఞానంతోనే ఈ ఏడాది నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో ఆలిండియా స్థాయిలో 40,000 వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. ఇప్పుడు కాలేజీలో సీటు వచ్చింది. కానీ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు కనీసం రూ. 2 లక్షలైనా అవుతుంది. ఈ డబ్బులు లేక చదువుకి దూరం అవుతున్నానేమో, డాక్టర్ ని అవ్వలేనేమో అని హారిక బాధపడుతోంది. తనకి ఎవరైనా పెద్ద మనసు చేసుకుని ఎంబీబీఎస్ చదివేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
ఆమె ప్రస్తుతం ఎక్కడుంటుందో తెలియదు. కానీ ఆమెకు ఆర్థిక సహాయం అవసరం అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోచింగ్ కి కాసులు లేక యూట్యూబ్ క్లాసుల ద్వారా నీట్ కోచింగ్ తీసుకుని కాలేజ్ గేటు వరకూ రాగలిగింది. కాలేజ్ సీటు తెచ్చుకోగలిగింది. ఇక మెడలో స్టెతస్కోపు, డాక్టర్ కోటు కావాలని కోరుకుంటోంది అంతేకదా. ఇచ్చేద్దాం అండి. పెద్ద మనసున్న వారు ఆమె చదువుకయ్యే ఖర్చు పెట్టుకోవచ్చు. డబ్బులు లేకపోయినా కనీసం షేర్ చేయడం ద్వారా అయినా.. సాయం చేయడానికి రెడీగా ఉన్న వారు చేసే అవకాశం ఉండచ్చు. కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఒక గొప్ప డాక్టర్ ని సమాజానికి అందించాల్సిన బాధ్యత మనది.