అన్నయ్య చనిపోతున్నాను. ఇక నేను మిమ్మల్ని కలవలేను.. ఇదే నా చివరి ఫోన్ కాల్.. నన్ను క్షమించండి.. ఇదీ ఓ యువకుడు తన అన్నతో మాట్లాడిన మాటలు. అంతే ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు.
ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చనిపోతున్నాను అని చెబితే కుటుంబ సభ్యులకు ఎంత నరకంగా ఉంటుందో. తమ కుటుంబ సభ్యుడి కోసం వెతకడం మొదలుపెడతారు. ఎలాగైనా వారిని చావకుండా ఆపాలని ప్రయత్నం చేస్తారు. కానీ సినిమా కాదు కదా, అనుకున్నట్టు జరగడానికి. ఇలా రోజూ అనేక మంది తమ ఇంట్లో వారికి కాల్ చేసి చనిపోతున్నా అంటూ భయపెడుతుంటారు. ఏవో చిన్న చిన్న సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అన్నయ్య నేను చనిపోతున్నాను. నేను ఇక కలవను. ఇదే చివరి ఫోన్ కాల్.. నన్ను క్షమించండి’ అంటూ ఓ యువకుడు తన సోదరుడికి కాల్ చేసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామం నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నాల్గవ ఫేజ్ కి కుటుంబంతో కలిసి వచ్చాడు కేదరిశెట్టి శివ సాయి గణేష్ (22). కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్బీలో మిర్చి బజ్జీ బండి నడిపేవాడు. ఇతని సోదరుడు మణికంఠ మాదాపూర్ లో మిర్చి బజ్జి వ్యాపారం చేస్తున్నాడు. అంతా ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. మణికంఠ పుట్టినరోజున రాత్రి 10.24 గంటలకు సోదరుడు శివ సాయి గణేష్ ఫోన్ చేసి చనిపోతున్నా అని చెప్పాడు. ఇక నేను కలవను, ఇదే ఆఖరి కాల్ అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. దీంతో మణికంఠ పరుగుపరుగున ఇంటికి వెళ్లి విషయం ఇంట్లో చెప్పాడు.
అనంతరం హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల తమ్ముడి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అందరినీ అడుగుతూ వెళ్తుండగా.. తమ్ముడు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలుసుకున్నాడు. దీంతో అన్న గుండె ఒక్కసారిగా పగిలినంత పనయ్యింది. తన పుట్టినరోజు నాడే తమ్ముడు విగతజీవిగా మారడంతో బోరున విలపించాడు మణికంఠ. ఆర్థిక సమస్యల కారణంగా గణేష్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయని తమకు ఒక మాట కూడా చెప్పలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. శవపరీక్ష అనంతరం రైల్వే పోలీసులు శివ సాయి గణేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.