పండుగ అంటే.. సాధారణ రోజులతో పోలిస్తే.. ఖర్చు బాగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా పండుగ సందర్భంగా సరుకుల జాబితా చాంతడంతా అవుతుంది. ఎందుకంటే పండుగ వేళ.. పిండి వంటలు చేస్తారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగల వేళ.. రెండుమూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. నాన్ వెజ్ వంటలు కూడా భారీగానే చేస్తారు. ఈ క్రమంలో సాధారణ రోజులతో పోలిస్తే.. వంట నూనె వాడకం బాగా పెరుగుతుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు కొందరు కేటుగాళ్లు. 25 కేజీల నూనెను కేవలం సగం ధరకే ఇస్తామంటూ జనాలకు ఆశ చూపారు. ఇంకేముంది మనోళ్లు ఎగబడ్డారు. అవసరం ఉన్నా లేకపోయినా రెండు మూడు క్యాన్లు కొనుక్కున్నారు. ఇంటికి వెళ్లి ఒపెన్ చేసి చూసి షాకయ్యారు. లబోదిబో అని మొత్తుకుంటున్నారు. మరి ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవండి..
వరంగల్ జిల్లా రంగశాయిపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పండగ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పండుగ సందర్భంగా వంట నూననెకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక గత కొంతకాలంగా.. నూనె ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రమంలో కేటుగాళ్లు.. సగం ధరకే నూనె డబ్బాలు ఇస్తామంటూ రంగంలోకి దిగి.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. సగం ధరకు అమ్ముతున్న ఈ నూనె డబ్బాలో.. నూనెకు బదులుగా నీళ్లు నింపి.. 2500 రూపాయలు ఉన్న నూనె డబ్బాను 1600లకే ఇస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు.
సగం ధరకే నూనె డబ్బా వస్తుండటంతో.. జనాలు వాటిని కొనుక్కునేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒక్కొక్కరు రెండు, మూడు డబ్బాలు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి వాటిని తెరిచి చూసి షాకవుతున్నారు. డబ్బాల్లో నూనె బదులు నీళ్లు ఉండటంతో.. మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. ఎక్కడ ఆ నూనె డబ్బాలను కొనుగోలు చేశారో అక్కడికి వెళ్లి గొడవ పడుతున్నారు. ఇప్పటి వరకు కల్తీ నూనెల అమ్మకాల గురించే విన్నాం. కానీ ఇలా పూర్తిగా నీళ్లు నింపి.. నూనెగా అమ్మడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.