వికారాబాద్ జిల్లా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అనంతగిరి ఘాట్ రోడ్డు వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ దిగుతుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ బస్సు పటాన్‌చెరు పరిధిలోని కేసారం గ్రామం నుండి తమ బంధువు అంత్యక్రియల కోసం ధారూర్ మండలం చింతకుంట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతగిరి కొండలను దిగి వికారాబాద్ వైపు వస్తున్న సమయంలో ఒక ప్రమాదకరమైన టర్నింగ్ పాయింట్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా లోయలోకి బోల్తా పడింది. కొండపై నుంచి కిందకు పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జయ్యి ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ప్రమాద ధాటికి బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. మిగతా 51 మంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి వాహనదారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చీకట్లో లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్సులు, పోలీసులు స్పాట్‌కి చేరుకుని గాయపడిన వారందరినీ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.”
సమాచారం అందిన వెంటనే వికారాబాద్ జిల్లా ఎస్పీ, వికారాబాద్ డిఎస్పీతో పాటు భారీగా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. లోయలో పడిపోయిన బస్సులో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో పోలీసులు టార్చ్ లైట్ల వెలుతురులో గాలింపు చర్యలు కొనసాగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పోస్ట్ చేశారు.
