ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుండటాన్ని చూస్తున్నాం. మన దేశం నుంచి చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అయితే లక్షల జీతం అందుకుంటున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ స్వదేశానికి దూరంగా ఉన్నామనే బాధ వారిలో ఉంటుంది. అందుకే కుదిరినప్పుడల్లా సొంతూళ్లకు వచ్చి పోతుంటారు. తమ వారిని కలిసి, పాత రోజులను గుర్తు చేసుకుంటారు. అలాగే తమ పిల్లల్ని కూడా వెంట తీసుకొచ్చి మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను అలవాటు చేస్తుంటారు.
ఇలాగే ఓ తండ్రి తన కొడుకును ఇండియాకు తీసుకొచ్చాడు. ఇక్కడి కల్చర్‌తో పాటు క్రమశిక్షణను నేర్చుకుంటాడని అనుకున్నాడు. ఇంతలోనే దారుణం జరిగింది. సైక్లింగ్ చేస్తున్న ఆ బాలుడ్ని ఓ బైక్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్‌లో ఇంద్రప్రస్థ కాలనీలో చోటుచేసుకుంది. సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మి అనే దంపతులు న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు. వీళ్లిద్దరూ న్యూజిలాండ్ సిటిజన్స్ కావడం గమనార్హం. అక్కడ చదువుతున్న 13 ఏళ్ల తన కొడుకు సాయి శ్రీకాంత్ రెడ్డిని ఇండియా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి తీసుకొచ్చాడు సురేందర్ రెడ్డి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలియాలని ఆయన భావించాడు. అయితే సాయి శ్రీకాంత్ రెడ్డి సైక్లింగ్ చేస్తుండగా ఇద్దరు మైనర్లు బైక్ నడుపుతూ ఢీకొట్టారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
క్రమశిక్షణ నేర్పించాలని తన కొడుకు సాయి శ్రీనివాస్‌ను ఇక్కడకు తీసుకొస్తే.. మైనర్ల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా బలయ్యాడని వాపోయాడు సురేందర్ రెడ్డి. న్యూజిలాండ్‌లోనే ఉన్నా తన కొడుకు బతికేవాడని కన్నీరుమున్నీరయ్యాడు. బాలుడి తల్లికి ఈ విషయం ఇంకా తెలియదట. ఆమె ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్ నుంచి ఇక్కడకు రానున్నారు. చాన్నాళ్ల తర్వాత బిడ్డను చూసేందుకు వస్తున్న ఆ తల్లి.. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఎలా తట్టుకుంటుందోనని తల్లడిల్లుతున్నారు కుటుంబ సభ్యులు. మరి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.