చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు కలిపే ఏకైక మార్గం రహదారి. అయితే పల్లెల నుండి పట్నాలకు చదువులు కానీ, ఉద్యోగాలు నిమిత్తం కానీ, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగించేందుకు బస్సును వినియోగిస్తాం.
చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు కలిపే ఏకైక మార్గం రహదారి. అయితే పల్లెల నుండి పట్నాలకు చదువులు కానీ, ఉద్యోగాలు నిమిత్తం కానీ, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగించేందుకు బస్సును వినియోగిస్తాం. అందరూ నగరాల్లో ఉండలేని పరిస్థితుల నిమిత్తం, దూర భారాలు ప్రయాణించి..రోజువారి తమ విధులు నిర్వర్తించి తిరిగి బస్సులో ఇంటికి పయనమవుతుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీటీసీ సంస్థ కూడా వివిధ రూట్లలో బస్సులు నడుపుతూ ఉంటుంది. అయితే పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొన్ని రూట్లలో మెరుగైన సర్వీసులందించేందుకు ప్రయత్నిస్తుంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే పలు రూట్లలో డబుల్ డక్కర్, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టింది. అలాగే ఐటీ ఉద్యోగుల నిమిత్తం కారిడార్లకు ప్రత్యేకంగా మినీ బస్సులను తిప్పుతోంది.
ఇప్పుడు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలకు బస్సు సర్వీసులను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు రద్దీగా ఉండే మేడ్చల్-మెహిదీ పట్నం రూట్‌లో మెట్రో సర్వీసులను తీసుకురానుంది. ఈ రూట్‌లో ఆరు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు రానున్నాయి. మేడ్చల్-మెహిదీపట్నం మధ్య ప్రతి రోజు ఉదయం 6.40 నుండి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7.20 వరకు అందుబాటులో ఉంటాయి. మెహిదీ పట్నం-మేడ్చల్ మధ్య ఉదయం 8.20 నుండి రాత్రి 9.05 గంటల వరకు సర్వీసులు ఉండనున్నాయి. మొత్తంగా 24 ట్రిప్పులు నడపునున్నారు. ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఉపయోగించుకుని వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇక ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు 1000 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది టీఎస్ఆర్టీసీ. కొత్త బస్సుల్లో 416 ఎక్స్‌ప్రెస్, 300 పల్లెవెలుగు బస్సులు, రాజధాని, ఏసీ బస్సులు ఉండనున్నాయి. అలాగే 1560 ఎలక్ట్రిక్ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు సిద్ధమౌతుంది. ఎలక్ట్రిక్ బస్సులను ఐటీకారిడార్, శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్లలో కనిపించనున్నాయి. ఇందుకోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. వీటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుండి రుణాలను పొందనుంది. త్వరలో రానున్న 50 ఎలక్ట్రిక్ బస్సులను జీహెచ్‌ఎంసీ పరిధిలో తిప్పనున్నారు. బాచుపల్లి, వనస్థలిపురం, నిజాంపేట నుంచి వేవ్‌రాక్‌కు 30 ఎలక్ట్రిక్ బస్సులు, ఎయిర్‌పోర్ట్‌కు 20 బస్సులు తిప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక 10 డబుల్ డెక్కర్ బస్సులను కొత్తగా అందుబాటులోకి తీసుకురానుండగా.. వీటిని ఏ రూట్ల మధ్య నడపాలనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.