ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ హమీలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే పార్టీలన్ని దూకుడు పెంచాయి. విపక్షాలు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ ప్రజల్లో తిరగడం ప్రారంభిస్తే.. అధికార పార్టీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చే పనిలో ఉంది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేస్తామని గతంలోనే ప్రకటించారు. దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. త్వరలోనే కొత్త కార్డులను జారీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తాజాగా ప్రకటించారు.
రాష్ట్రంలో లక్షల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. రేషన్ సరుకులు, ఆరోగ్య శ్రీ వంటివి లభించక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డు దరఖాస్తులను క్లియర్ చేసి వెంటనే.. కొత్త కార్డులను మంజూరు చేయాలని ప్రతి పక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించడంతో.. ఇప్పటికైనా తమకు రేషన్ కార్డులు అందుతాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరగున్న క్రమంలో ప్రభుత్వం త్వరలోనే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వెంటనే రేషన్ కార్డులను ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. పెండింగ్‌లో ఉన్న పనులను షరవేగంగా పూర్తి చేస్తోంది. అలానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మిగతా కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభించనుందని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న ఎన్నికల హామీలను కూడా పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.