గత కొన్ని రోజులుగా తెలంగాణలో అధికార పార్టీకి ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి బయటకు రాకుండా ఆయనను నిర్బంధించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి రేవంత్ ఇంటిదగ్గర భారీగా బలగాలను మొహరించారు పోలీసులు.
హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన ఇంటిలోకి ఎలా వస్తారని ఏసీపీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డారు. సర్కార్ ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతుందని… సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు.
ఇది చదవండి : భారత్ లో కోవిడ్ విజృంభన.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!
కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడు అని వ్యాఖ్యానించారు. హౌజ్ అరెస్ట్ నేపథ్యంలో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇక రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాగా, మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లి రచ్చబండ సందర్భంగానూ రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
