టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నేషనల్ వైడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పెళ్లి గురింయచి చర్చ జరుగుతోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. నవంబర్ 11న పెళ్లి, నవంబర్ 21న రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ వైరల్‌గా మారి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అసలు ఆ పెళ్లి కార్డులో ఏముంది? కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఆ బాక్స్ విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. కేవలం పెళ్లి కార్డు కోసమే ఇంత ఖర్చు చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ లగ్జరీ బాక్స్‌ను ఓపెన్ చేయగానే, అద్భుతమైన నెమలి పించాల మధ్యలో మెరిసిపోతున్న సుందరమైన గణేషుడి ప్రతిమ కనువిందు చేస్తోంది. ఇక దాని లోపలికి వెళ్తే శ్రీవారి చిత్రపటాలతో పాటు, నోరూరించే ఖరీదైన స్వీట్లు, కాస్ట్లీ గిఫ్ట్‌లను ఆ ఇన్విటేషన్ బాక్స్‌లో ఉంచారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ రాజకీయ, సినీ దిగ్గజాలకు ఈ ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేస్తున్నారు.
అయితే, ఈ ఆహ్వాన పత్రికలో ఉన్న ఒక ప్రధాన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు, రకరకాల ఊహాగానాలకు దారితీసింది. ఆ వెడ్డింగ్ కార్డ్‌లో తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే దివంగత అధినేత ముత్తువేల్ కరుణానిధి ఫోటోను ముద్రించడమే కాకుండా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్నట్లుగా అందులో ప్రింట్ చేసి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి కార్డులో డీఎంకే టాప్ లీడర్స్ ఫోటోలు ఎందుకు వచ్చాయి? అసలు మారన్ కుటుంబానికి, స్టాలిన్ కుటుంబానికి మధ్య ఎలాంటి బంధుత్వం ఉంది? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి.
ఈ ప్రశ్నకు అసలు సమాధానం వారి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ, బంధుత్వ నేపథ్యమే. సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి కుటుంబానికి, మారన్ కుటుంబం రక్తసంబంధీకులే కావడం గమనార్హం. కరుణానిధి అన్న కుమారుడైన మురసోలి మారన్ కుమారుడే ఈ కళానిధి మారన్. అంటే వరుసకు కరుణానిధికి కళానిధి మారన్ మనవడు అవుతారు. అలాగే ఎంకే స్టాలిన్‌కు కళానిధి మారన్ స్వయానా మేనల్లుడు వరుసవుతారు. అందుకే ఈ కుటుంబ బంధాల కారణంగానే వివాహ ఆహ్వాన పత్రికలో కరుణానిధి, స్టాలిన్ ఫోటోలు ప్రముఖంగా ముద్రించారు.
ఒకవైపు ప్రముఖ సంగీత దర్శకుడు, మరోవైపు ప్రముఖ మీడియా వ్యాపారవేత్త కుమార్తె ఒక్కటవుతుండటంతో ఈ పెళ్లి కోలీవుడ్ నుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వరకూ హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 21న జరగబోయే ఈ రిసెప్షన్‌కు దేశం నూలువులా ఉన్న ప్రముఖులంతా హాజరవుతారని భావిస్తున్నారు. లగ్జరీ హంగులతో తయారైన ఈ పెళ్లి కార్డు, రాజకీయ-వ్యాపార దిగ్గజాల కలయికగా నిలుస్తున్న ఈ వివాహం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండింగ్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది
