ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. భర్త ప్రేమతో గట్టిగా కౌగిలించుకోవడంతో ఒక మహిళ ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగాయి.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది… జియాంగ్సూ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి తన భార్యకు చలిగా ఉందని చెప్పడంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ‘టక్’ మని శబ్దం రావడంతో పాటు, ఆమెకు తీవ్రమైన నొప్పి మొదలైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, సీటీ స్కాన్‌లో ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరొకటి పగిలినట్లు వైద్యులు నిర్ధారించారు. మామూలు శక్తితోనే కౌగిలించుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని భర్త వాంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజానికి ఈ కథలో విలన్ భర్త కౌగిలింత కాదు… ఆ మహిళకున్న ‘ఆస్టియోపొరోసిస్’ అనే ఎముకల వ్యాధి! అవును, వైద్య పరీక్షల్లో ఆమె ఎముకలు సాంద్రత కోల్పోయి, పెళుసుగా మారినట్లు డాక్టర్లు తేల్చారు. దీనికి ప్రధాన కారణం ఆమె జీవనశైలే. వాంగ్ భార్య బరువు కేవలం 45 నుంచి 50 కిలోల మధ్య మాత్రమే ఉంటుంది. సన్నగా, స్లిమ్‌గా కనిపించాలనే కోరికతో ఆమె తరచూ రాత్రి పూట భోజనం మానేసేది. అంటే విపరీతమైన డైటింగ్ చేసేది. దానికి తోడు రోజుకు ఎడాపెడా కాఫీలు తాగే అలవాటు ఉంది. పైగా రోజంతా ఇంట్లోనే, ఆఫీసులోనే ఉండటం వల్ల ఆమె ఒంటికి ఎండ తగిలేదే కాదు ఫలితంగా శరీరానికి కావాల్సిన విటమిన్ డి , కాల్షియం అందకపోవడంతో ఎముకలు అట్టముక్కల్లా మారిపోయాయి. ఎముకలు అంత బలహీనంగా ఉన్నవారిని అకస్మాత్తుగా గట్టిగా కౌగిలించుకున్నా, పైకి ఎత్తినా… పక్కటెముకలపై తీవ్రమైన ఒత్తిడి పడి ఇలాగే విరిగిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. అదృష్టవశాత్తూ, ఆ మహిళకు సర్జరీ చేయాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. కేవలం కొన్ని మందులు, ఆయింట్మెంట్లు ఇచ్చి పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించి డిశ్చార్జ్ చేశారు.
మరోపక్క ఈ సంఘటన ఫన్నీగా అనిపించినా… దీని వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. జీరో సైజ్ కోసం, స్లిమ్‌గా కనిపించడం కోసం సరైన పోషకాహారం తీసుకోకుండా ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేస్తే… భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండ తగలడం, కాల్షియం ఉన్న ఫుడ్ తినడం మన ఎముకల బలానికి చాలా ముఖ్యం. లేదంటే రేపు పొద్దున ఎవరైనా ఫ్రెండ్లీగా వెన్ను తట్టినా ఎముకలు ఫట్ మనే ప్రమాదం ఉంది. కాబట్టి అందం కంటే ఆరోగ్యం ముఖ్యం అనడానికి ఇదిగో ఈ ఘటనే నిదర్శనం…
