ఓ వైపు నవరాత్రి ఉత్సవాలు… మరోవైపు శ్రీవారి గరుడోత్సవ వేళ తిరుమల కొండపై భారీ వర్షం దంచికొడుతుంది. అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా దంచికొట్టిన వర్షానికి భక్తులు తడిసి ముద్దయ్యారు. అయినాసరే, స్వామివారిపై ఉన్న భక్తితో గ్యాలరీల నుంచి కదలకుండా అలాగే నిలబడిపోయారు భక్తులు! కేవలం తిరుమల మాత్రమే కాదు… అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. తిరుపతి విమానాశ్రయం రన్వే పైకి వర్షపు నీరు వచ్చి చేరింది. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అందునా అత్యంత ప్రాముఖ్యమైన గరుడోత్సవ సేవల రోజు తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖానంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్వామివారిని దర్శించుకోవడానికి, గరుడ వాహన సేవను కళ్లారా వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు కొండపైకి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసిన వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొందరు భక్తులు తడిసి ముద్దవ్వగా, మరికొందరు గొడుగుల సాయంతో తలదాచుకున్నారు. అయితే, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షంలో తడిసిపోతున్న భక్తులకు తక్షణ సహాయంగా గొడుగులు, టార్పాలిన్లను ఉచితంగా అందజేశారు. అంతటి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా గ్యాలరీల్లోనే ఉండి శ్రీవారి నామస్మరణ చేస్తూ గరుడోత్సవాన్ని తిలకించడం విశేషం…
తిరుమలలోనే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. నిన్న మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి తిరుపతి విమానాశ్రయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.. కొత్త, పాత టెర్మినళ్ల వద్ద ఉన్న భారీ ప్రహరీ గోడలు కూలిపోవడంతో, విపరీతమైన వర్షపు నీరు నేరుగా రన్వే వైపునకు దూసుకొచ్చింది. దీంతో విమానాశ్రయ ప్రాంగణం చెరువును తలపించింది. ప్రతికూల వాతావరణం, రన్వేపై నీరు చేరడంతో విజయవాడ నుంచి తిరుపతి రావాల్సిన విమానాన్ని చెన్నైకి మళ్లించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దక్షిణ కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల ఈ భారీ వర్షాలు కురుస్తుయాని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే… భారత వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అక్టోబర్ 22 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో రాజధాని హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ప్రస్తుత వర్షాల సంగతి ఇలా ఉంటే… రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అందులోనూ ఒక అల్పపీడనం బలపడి తుపానుగా మారే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్నదాతలు తమ పంటల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.మొత్తానికి ప్రకృతి ఎంత కఠినంగా మారినా, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల ఆత్మస్థైర్యం ముందు ఆ వాన కూడా చిన్నబోయిందనే చెప్పాలి. అయితే, వర్షాలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
