కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ‘ఇండియా బ్లాక్’ పార్టీల పిలుపు మేరకు ఇవాళ తలపెట్టిన ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి బయలుదేరిన ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవారంలోని ఆమె నివాసంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.
విజయవాడ శివారులోని గన్నవరం కేసరపల్లిలో ఉన్న వైఎస్ షర్మిల నివాసం చుట్టూ ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించారు. ఎటు చూసినా ఖాకీల బందోబస్తుతో ఆ ప్రాంతం మొత్తం ఒక పోలీస్ క్యాంపును తలపిస్తోంది. లెనిన్ సెంటర్ నుండి ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ వరకు భారీ మార్చ్ నిర్వహించటానికి షర్మిల సిద్ధమయ్యారు. అయితే, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందనే సాకుతో పోలీసులు ఈ నిరసన మార్చ్‌కు పర్మిషన్ లేదని తేల్చిచెప్పారు. దీంతో షర్మిల బయటకు రాకుండా కట్టడి చేస్తూ ఇంటివద్దే పోలీసులు పహారా కాస్తున్నారు.

మరోవైపు విజయవాడలోని రాజ్ భవన్ వద్ద కూడా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా కీలక ప్రాంతాలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేవలం షర్మిల మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ప్రముఖ నేతలు రాజ్ భవన్ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ లీడర్లను అడ్డుకుంటున్న పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరుగుతుండటంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ప్రజా సమస్యలపై గళం ఎత్తుతుంటే ప్రభుత్వం ఇలా గృహనిర్బంధాలు చేయడం ఏమిటని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా అణచివేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని షర్మిల వర్గం మండిపడుతోంది. ఉదయం నుంచే షర్మిల ఇంటి వద్ద పట్టువీడని నాయకులు, వారిని కట్టడి చేస్తున్న పోలీసుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
