సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్ గోపాల్ పేట్ లో ఉన్న డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తర్వాత అవి పై అంతస్తులోని స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. అంతేకాక పక్కన ఉన్న షాపులకు కూడా పాకాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పటం మొదలుపెట్టారు. సుదీర్ఘ సమయం తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కున్నారని సమాచారం. ఈక్రమంలో తాజాగా మొదటి అంతస్తు భవనంలో ఓ అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు.
సికింద్రాబాద్ లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది డ్రోన్ ద్వారా భవనం లోపలి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే డెక్కన్ నైట్ వేర్ భవనంలోని మొదటి అంతస్తులో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి అస్థి పంజరం కనిపించింది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఆ ముగ్గురులో ఎవరిదనే తెలియాల్సి ఉంది. మంటలు అదుపు చేసే సమయంలో లోపలికి ముగ్గురు వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు.
ఆ ముగ్గురు వ్యక్తులు కూడా దుకాణంలో ఉన్న తమ వస్తువులను తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పొగ వల్ల రెండు రోజుల నుంచి అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈ రోజు మరోసారి పొగలను ఆర్పివేసి.. లోపలికి వెళ్లి.. పరిశీలించారు. ఈక్రమంలో వారికి ఓ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఇక మిగత ఇద్దరి కోసం అధికారులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. అలానే ఈ ప్రమాదంలో మంటలు ఆర్పుతున్నపుడు ఫైర్ సిబ్బంది థనుంజయ రెడ్డి, డ్రైవర్ నర్సింగరావు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే అగ్నిమాపక ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు.