స్పా ముసుగులో కొంతమంది వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. డబ్బు సంపాదించాలన్న ఆశ ఎక్కువై కొంతమంది అమాయక ఆడపిల్లల జీవితాలను స్పా’యిల్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నా గానీ మళ్ళీ కొత్తగా డ్రగ్స్ రాకెట్, సెక్స్ రాకెట్లు అనేవి పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ లో కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. పది రోజుల్లో పోలీసులు 25 స్పాలపై దాడి చేసి అమాయక యువతులను రక్షించారు. హైదరాబాద్ లో స్పా సెంటర్లు చాలానే ఉన్నాయి. అయితే చాలా వరకూ స్పా సెంటర్లు లైసెన్స్ తీసుకుని, నియమ నిబంధనలకు అనుగుణంగా నడుపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం బయట బోర్డు మీద ఉండేది ఒకటి.. లోపల చేసేది ఒకటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. బోర్డు మీద స్పా బిజినెస్ అని ఉంటే.. లోపల మాత్రం అమ్మాయిల జీవితాలను స్పాయిల్ చేసే బిజినెస్ ని నిర్వహిస్తున్నారు.
స్పాలలో ఉద్యోగం కోసమని, ఉపాధి కోసమని వచ్చే అమ్మాయిల జీవితాలను అనారోగ్యం పాలు చేస్తున్నారు. కొంతమంది పేద అమ్మాయిలను డబ్బు ఆశ చూపించి ఈ వృత్తిలోకి దింపుతుంటే.. మరి కొంతమందిని బలవంతంగా ఇందులోకి దింపుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చాలా స్పా సెంటర్లు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు స్పా ముసుగులో వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నా గానీ ఇలాంటి గలీజ్ దందాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న గ్యాంగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెయిన్ స్పాలో తనిఖీలు చేయగా ఐదుగురు అమ్మాయిలు ఉపాధి కోసం వచ్చి వీరి కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఐదుగురు యువతులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడు సయ్యద్ బిలాల్ తో పాటు ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్ కి తరలించారు. ఈ పది రోజుల్లో 25 స్పాలపై దాడి చేసిన పోలీసులు ఇప్పటి వరకూ 80 మంది యువతులను రెస్క్యూ చేశారు. ఉపాధి కోసమని, ఉద్యోగం కోసమని వచ్చే యువతులకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఈ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. అలాంటి వారితో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా స్పాలు, మసాజ్ సెంటర్లలో ఉద్యోగం కోసం వెళ్లే యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ నీచపు పనికి పాల్పడుతుంది కొంతమంది ధనవంతులే. నిజానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్పా సెంటర్లు నిర్వహించాలంటే లక్షలు సరిపోవు. పెట్టుబడి కోట్లలో ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను సామాన్య, మధ్యతరగతి ప్రజలు చేయలేరు. బాగా డబ్బున్న వారే ఇలాంటి వ్యాపారాలను చేయగలరు. చాలా వరకూ ధనవంతులు న్యాయంగా స్పా సెంటర్లను నిర్వహిస్తుంటే.. కొంతమంది ధనవంతులు మాత్రం డబ్బు ఆశ ఎక్కువై స్పా ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. న్యాయంగా ఇతర వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకునే కెపాసిటీ ఉన్నా కూడా వ్యభిచారాన్నే తమ వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం.. తెలిసో, తెలియకో ఈ వ్యభిచార ఊబిలో పడి మునిగిపోతున్న వారిని రక్షించి ఉపాధి హామీలు ఇస్తుంటే.. కొంతమంది తమ స్వార్థం కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళు తమ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.