అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు యువకుడు సజీవదహనమయ్యాడు. అతడు కారులో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
భవిష్యత్తుపై గంపెడాశలతో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాడో యువకుడు. ఉన్నత చదువులు పూర్తి చేసి, ఆ తర్వాత మంచి జాబ్‌లో చేరాలని భావించాడు. ఈ క్రమంలో చదువులో బిజీ అయిపోయాడు. ఇంకొన్నాళ్లు కష్టపడితే చదువు పూర్తయ్యేది. కానీ మృత్యు దేవత అతడ్ని తీసుకెళ్లిపోయింది. అనూహ్య ప్రమాదం బారిన పడిన ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో చోటుచేసుకుంది. న్యూజెర్సీలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు. ఆ యువకుడిది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలం, బడాభీమ్‌గల్ గ్రామం.
బడాభీమ్‌గల్ గ్రామస్తులైన గుర్రపు సత్యం, శకుంతల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు శైలేష్ (21) ఇంజినీరింగ్ పూర్తి చేశాక, ఉన్నత విద్య కోసం గత సంవత్సరం యూఎస్‌లోని న్యూజెర్సీ సిటీకి వెళ్లాడు. అయితే శనివారం అనూహ్య ప్రమాదానికి గురయ్యాడు శైలేష్. అతడు వెళ్తున్న కారును, మరో కారు ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ యాక్సిడెంట్లో శైలేష్ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో అతడు మంటల్లో కాలిపోయి చనిపోయాడు. శైలేష్ మృతి చెందాడనే సమాచారాన్ని న్యూజెర్సీ నగర అధికారులు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతడి మరణ వార్తను వినగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శైలేష్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించాలని కుటుంబసభ్యులు, బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విన్నవించారు.