మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతోంది. త్వరలో 2,216 మద్యం దుకాణాల లైసెన్సులు ముగుస్తున్న నేపథ్యంలో వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈసారి ఉన్న షాపులకు అదనంగా మరో 200 మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలోనే… మద్యం షాపుల సంఖ్యను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. ఇందుకోసం ప్రభుత్వంలోని ఆబ్కారీ విభాగం… కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్ చివరి నాటికి తేవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే… అదనంగా మరో 200 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఐతే… కొత్తగా నిర్మించిన 80 బార్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా… పలు కారణాలతో అవి ప్రారంభం కాలేదు. ఏడేళ్లుగా తెలంగాణలో ఒక్క కొత్త మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వలేదు. అధికారులేమో… షాపుల సంఖ్య పెంచితే బాగుంటుందని ఓ ప్రతిపాదన పెట్టారు. కొత్త మండలాలు, మున్సిపాలిటీల వారీగా కొత్త ప్రాంతాల్లో దుకాణాలు తెరవాలని అధికారులు ప్రతిపాదించారు.
రెవెన్యూ పెంచుకునేందుకు ఈసారి మద్యం దుకాణాల వేలం లైసెన్స్ ఫీజు కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. అదనంగా రూ.1,200 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆబ్కారీ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9 వేలకోట్ల ఆదాయం వస్తోంది. 2015-2017 వేలంలో… రూ.50,000 ఉన్న అప్లికేషన్ ఫీజును తర్వాతి రెండేళ్లకు జరిగిన వేలంలో రూ.లక్షకు పెంచారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని రూ.3లక్షలు చెయ్యాలనే ప్రతిపాదన ఉందిని తెలుస్తోంది. మరి మద్యం ధర పెంచకుండా.. వేలం ఫీజు పెంచితే యజమానులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.