తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లను ఇకపై షోరూంలోనే చేసే ఆలోచన చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త వాహనం లేదా బైక్ కొనుగోలు చేసిన తరువాత ముందుగా ఇచ్చేది టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ తరువాత ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రకారం పర్మినెంట్ నెంబర్ కేటాయిస్తుంటారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియ నడుస్తుంటుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా మార్పులు చేయవచ్చు.
తొలి దశలో హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన షోరూంలలో ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం ప్రవేశపెట్టి విజయవంతమైతే రాష్ట్రమంతా వచ్చే ఏడాది జనవరి నాటికి అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. షోరూంలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే వాహనానికి సంబంధించిన ఆర్‌సి స్మార్ట్ కార్డు ఇంటికి పోస్టులో వచ్చేస్తుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అయితే ఈ విధానంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే నిర్ణయం తీసుకోవచ్చు.