తెలంగాణలోని అర్చకులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నెలవారీగా ఇచ్చే గౌరవ భృతి విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్‌పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ భవనాన్ని పీఠాధిపతులు, వేద పండితులతో కలసి ఆయన మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. తమ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
వేదశాస్త్ర పండితులకు ఇచ్చే గౌరవ భృతిని పెంచడంతో పాటు ఆ భృతిని పొందేందుకు ఉన్న అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అలాగే ధూపదీప నైవేద్యం పథకం కింద మరో 2,796 ఆలయాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుందని.. మరో 2,796 గుళ్లను కలుపుకుంటే మొత్తంగా 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ధూపదీప నైవేద్యం కింద ఆలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేలు చొప్పున ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అనువంశిక అర్చకుల సమస్యలు, ఇబ్బందులను కూడా త్వరలోనే కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.