నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసి.. ఎన్నో బలి దానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో.. నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో.. పోలీసు శాఖకు చెందిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది పోలీసు కొలువుకు అప్లై చేయగా.. పలువురు వయో పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి అభ్యర్థనలు మన్నించిన ప్రభుత్వం మరో రెండేళ్లు సడలింపు ఇచ్చింది.
కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని తెలంగాణ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మొత్తం ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చినట్లు అయ్యింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీ-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి.. కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Thanks @KTRTRS for increasing the age limit for constables exam of #tslprb . On May 5 @TSATnetwork live show viewers wanted this. Telangana youth is indebted to you 🙏🙏 @TelanganaCMO
— Shailesh Reddy (@shaileshreddi) May 20, 2022
‘‘tslprb నిర్వహించబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇచ్చినందుకు గాను కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మే 5న టీశాట్ లైవ్ షో సందర్భంగా వ్యూయర్స్ వయో పరిమితి పెంచాలని అభ్యర్థించారు. తెలంగాణ సీఎంఓ వారి అభ్యర్థనను మన్నించి.. మొత్తం 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇచ్చింది. ఇందుకుగాను తెలంగాణ యువత మీకు రుణపడి ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపద్యంలో దరఖాస్తు గడువును కూడా సర్కారు పెంచింది. వాస్తవానికి యూనిఫాం ఉద్యోగాల దరఖాస్తుకు గడువు శుక్రవారం రాత్రి 10 గంటలతో ముగిసింది. రెండేళ్లు సడలింపు నేపథ్యంలో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు పోలీసు నియామక మండలి పొడిగించింది. యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే మూడేళ్ల సడలింపు ఇవ్వగా, తాజా నిర్ణయంతో మొత్తం సడలింపు అయిదేళ్లకు పెరిగింది.
* కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు (జులై1, 2022 నాటికి) కాగా సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 22గా ఉంది. నోటిఫికేషన్ సందర్భంలో మూడేళ్ల సడలింపు ఇవ్వడంతో గరిష్ట వయసు 25 అయింది. తాజాగా రెండేళ్ల సడలింపుతో ఇది 27 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వుడ్ అభ్యర్థులకు మరో అయిదేళ్లు సడలింపు ఉన్న నేపథ్యంలో గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లుగా మారింది.
* ఎస్సై ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 21 సంవత్సరాలు (జులై1, 2022 నాటికి) కాగా సాధారణ కేటగిరీరిలో గరిష్ట వయోపరిమితి 25 గా ఉంది. అది ఇప్పుడు 30 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వుడ్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లుగా ఉంది.
పోలీస్ నియామక మండలి మొత్తం 17వేలకు పైగా పోలీసు కానిస్టేబుల్, ఎస్సై, రవాణా, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీచేస్తున్న విషయం విదితమే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారందరికీ సడలింపు వర్తిస్తుంది.
టీశాట్:
సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్ (సాఫ్ట్‌నెట్) అనేది ఉపగ్రహ కమ్యూనికేషన్‌లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని.. నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన విభాగం. సాఫ్ట్‌నెట్ GSAT 8 ఉపగ్రహాన్ని ఉపయోగించుకుని నాలుగు ఛానెళ్లను ప్రసారం చేస్తుంది. వీటిలో ముఖ్యమైనవి T-SAT నిపుణ, T-SAT విద్య. ఇవి తెలంగాణ ప్రజల వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలి-మెడిసిన్ఈ-గవర్నెన్స్ అవసరాలను తీరుస్తాయి.
సాఫ్ట్ నెట్ ఆయా రంగాల్లో ప్రముఖులు, విద్యావేత్తలు, అత్యుత్తమ అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తుంది. ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి ఉత్తమమైన కోచింగ్, దిశానిర్దేశాన్ని అందిస్తుంది. కాంపిటేటీవ్ పరిక్షలకు చదువుతున్న వారికి అవసరమైన సమాచారాన్ని అందించి.. వారికి ఏంతో మేలు చేస్తోంది.