విధి ఆడిన వింత నాటకంలో ఎప్పుడు ఎలా బలి అవుతారో చెప్పలేం. ఊహించని విధంగా జీవితాలతో ఆటలాడేసుకుంటుంది. పొరపాటో, గ్రహపాటో తెలియక సతమతమౌతుంటారు బాధితులు. దెబ్బ మీద దెబ్బకొడుతూ వెక్కిరిస్తుంటుంది
విధి ఆడిన వింత నాటకంలో ఎప్పుడు..ఎవరు.. ఎలా బలి అవుతారో చెప్పలేం. ఊహించని విధంగా జీవితాలతో ఆటలాడేసుకుంటుంది. పొరపాటో, గ్రహపాటో తెలియక సతమతమౌతుంటారు బాధితులు. దెబ్బ మీద దెబ్బకొడుతూ వెక్కిరిస్తుంటుంది. దీనికి సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా లేదు. బలహీనుల్ని మరింత బాధపెడుతుంది. హాయిగా ఉన్న జీవితాల్లో కుంగబాటు, కలవరపాటుకు గురి చేస్తుంది. బాధలోనూ మరింత విషాదాన్ని నింపగల సత్తా ఒక్క విధికి మాత్రమే ఉంది. విధి ఓ ఇంటిపై పగబట్టింది. భార్య చనిపోయిన కొద్ది గంటల్లోనే భర్తను కూడా బలితీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా లక్షెట్టి పేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మల్లిఖార్జునరావు (31), శరణ్య(29) భార్యాభర్తలు. అయితే పొరిగింటితో జరిగిన గొడవ కారణంగా మనస్థాపానికి గురైన శరణ్య ఈ నెల 13న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు భర్త అంబులెన్స్ పిలిపించాడు. మృతదేహాన్ని అందులో తరలిస్తుండగా.. దాని వెనుక బైక్‌పై భర్త మల్లిఖార్జునరావు వెళుతున్నాడు. లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద అతడి బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. అక్కడిక్కడే మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే భార్యా భర్తలు మరణించారు. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మరణంతో పిల్లలు అనాథలయ్యారు.