ఒకే రోజు రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఒక బస్సు పెట్రోల్ బంకు సమీపంలో పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు మంటలను డ్రైవర్ అదుపు చేశారు.
అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ లోంచి పొగలు వచ్చి బస్సు కాలిపోయింది. బస్సులో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంపల్లి నుంచి మెహిదీపట్నం వయా బోయినపల్లి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఐడీపీఎల్ ఆపోజిట్ లో పెట్రోల్ బంకు సమీపంలో బస్సు ఇంజన్ లోంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. పొగలు వస్తుండగా వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేసి.. ప్రయాణికులను బస్సులో నుంచి దించేశారు. అనంతరం బస్సు డ్రైవర్ కిందకు దూకేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
దట్టమైన పొగలు వచ్చి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. పెట్రోల్ బంకు పక్కనే ఉండడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బాలానగర్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురూ సురక్షితంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. రన్నింగ్ లో ఉండగా కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అది గమనించిన వాహనదారులు వెంటనే డ్రైవర్ కు అప్రమత్తం చేశారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన మదీనాగూడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బీరంగూడ నుంచి కూకట్ పల్లి వైపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బయలుదేరింది డ్రైవర్ తెలిపారు. ఒకేరోజు రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అగ్ని ప్రమాదానికి గురవ్వడం జనాలను ఆందోళనకు గురి చేస్తోంది.