అంగుళం భూమిని కూడా వదులుకోని మనుషులున్న ఈ సమాజంలో ఎకరంన్నర భూమిని తృణప్రాయంగా పేద ప్రజల కోసం వదులుకున్న మహానుభావుడి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఆయన చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మనుష్షులందు నీ కథ మహర్షిలాగ సాగదా అన్నట్టు మనుషుల కోసం ఆలోచించే వారిని మహర్షులనే అంటారు. కోట్ల ఆస్తి ఉన్న శ్రీమంతుడు కంటే.. మనుషులకు తన డబ్బును దానం చేసే శ్రీమంతుడే కొన్ని లక్షల రెట్లు గొప్పవాడని అంటారు. ఈరోజుల్లో అడుగు భూమిని తోడబుట్టిన వాళ్ళకే దక్కనివ్వడం లేదు. అడుగు భూమి కోసం ఏళ్ల తరబడి గొడవ పడుతూనే ఉంటారు. అలాంటిది కోట్లు విలువ చేసే భూమిని పేదల కోసం ఎవరైనా దానం చేస్తారా? అలా చేస్తే ఒరేయ్ పిచ్చోడా అంటుంది ఈ లోకం. ప్లాట్లుగా చేసి అమ్ముకుంటే కోట్లు వస్తాయి కదా.. వ్యాపారం చేతకాదు అని అంటారు. కానీ మనుషులకు, వ్యాపారులకు మధ్య తేడాని చూపించేదే మానవత్వం.
ఎకరం భూమి ఉంటే ఎవరైనా దాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకుని కోట్లు గడించుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా పేదలకు దానం ఇచ్చేశారు. ఆయన మరెవరో కాదు ప్రముఖ విద్యాసంస్థల వ్యవస్థాపకులు నల్ల మల్లారెడ్డి. రూ. 12 కోట్లు విలువ చేసే ఎకరంన్నర భూమిని పేదల కోసం తృణప్రాయంగా రాసిచ్చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం పంచాయతీ పరిధిలో తనకున్న ఎకరంన్నర భూమిని ప్లాట్లుగా విభజించి 75 మంది పేదలకు పట్టాలు అందజేశారు నల్ల మల్లారెడ్డి. జూలై 11న తమ కుమార్తె దివ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె చేతుల మీదుగా భూమికి సంబంధించిన పట్టాలను పేదలకు అందజేశారు.
75 మంది పేదలు ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను అందుకున్నారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్కార్యాన్ని తలపెట్టారు. ఆ 75 మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపడం కంటే గొప్ప బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. 75 కుటుంబాల ఆశీస్సుల కంటే గొప్ప బహుమతి తండ్రీ, కూతుర్లకు ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఎకరం రూ. 8 కోట్లు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. 12 కోట్లు విలువైన భూమిని పేదల ఇళ్ల స్థలాలుగా మార్చి దానం చేయడం పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి, కాచవానిసింగారం సర్పంచ్ కె. వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.