తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు ఉధృతికి మోరంచపల్లి గ్రామం నీట మునిగింది. 1500 మంది గ్రామస్తులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం నీట మునిగింది. మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది. గ్రామం మొత్తం నీట మునగడంతో ప్రజలు బిల్డింగులపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. ఒక పక్క నుంచి వర్షం పడుతున్నా సరే ఏమీ చేయలేక తడిసి ముద్దవుతున్నా మేడల మీదే ఉన్నారు. పశువులను సైతం మేడలు ఎక్కించి కాపాడుకుంటున్నారు. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఊరు ఊరంతా మునిగిపోయింది.
చాలా వరకూ ఇళ్ళు నీట మునిగిపోయాయి. సగం వరకూ బిల్డింగులు మునిగాయి. గుడులు, బడులు, బస్టాండ్ ఇలా ఊరు మొత్తం మునిగిపోయింది. 10 లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒక లారీ అయితే ఏకంగా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. లారీలోకి నీళ్లు వెళ్లిపోయాయి. సాయం కోసం లారీ డ్రైవర్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కొట్టుకుపోయినట్లు డ్రైవర్ చెబుతున్నారు. రోడ్ల మీద ఉన్న వారు వరదలకు భయపడి చెట్లు ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంలో 1500 మంది ఉంటారని సమాచారం. వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారా లేక ఏమైనా అయ్యిందా అనేది ఇంకా ఏమీ తెలియని పరిస్థితి.
ఊరు మొత్తం మునిగిపోవడం చాలా బాధాకరం. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో సామాగ్రి తడిసి ముద్దయ్యాయి. దీంతో బిల్డింగుల పైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను రక్షించాలంటూ గ్రామస్తులు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. భగవంతుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాకూడదని కోరుకుందాం.
పూర్తిగా జలదిగ్బంధంలో మొరంచపల్లి గ్రామం#TelanganaRains #Moranchapalli pic.twitter.com/priXksiOx7
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023