న్యూ ఇయర్ వేళ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్కిచ్చే వార్త చెప్పిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు వైన్ షాపులు, బార్లు, పబ్‌లు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2B లైసెన్సు కలిగిన బార్లలో అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వ రాబడి కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు.
అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా అధ్యక్షురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. డిసెంబర్ 31వ రాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరచి ప్రజలను లూటీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. హైకోర్టు రాత్రి 10గంటలకు మద్యం షాపులు మూసేయాలని చెప్పినా.. రాత్రి ఒంటి గంట వరకు పర్మిషన్ అంటూ చీఫ్ సెక్రటరీ కొత్త జీవో విడుదల చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన సునీతరావు, తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.రోజుకొకటి చొప్పున మైనర్లపై అత్యాచారాలు జరుగుతుంటే.. అర్థరాత్రి వరకు మద్యం షాపులకు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. డిసెంబర్ 31న పూర్తిగా మద్యం షాపులు ముసేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఒక్క మద్యం ద్వారానే రాష్ట్రానికి 45 వేల కోట్లు ఆదాయం వస్తుంది అంటే.. మద్యం పేరుతో ప్రభుత్వం ప్రజలను ఎలాలూటీ చేస్తుందో అర్థం అవుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత తండ్రిబాటలో నడుస్తుంది కాబట్టే.. లిక్కర్ స్కాంలో ఉన్నారని సునీతారావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 31న మద్యం షాపులు బంద్ చేయమనడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.