యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓ రైతు పొలంలో పని చేస్తుండగా నాలుగు లంకె బిందెలు బయటపడ్డాయి. ఈ ఘటన పదిరోజుల క్రితం జరుగగా.. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్వకాలంలో ఎక్కువ మొత్తంలో బంగారం నగదు దాచుకోవాలంటే బిందెల్లో పెట్టి గుర్తుగా భూమిలో పాతిపెట్టేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. పొలం తవ్వుతుండగా లంకె బిందెలు బయటపడ్డాయి అని చాలా చోట్ల మనం వినే ఉంటాం. అయితే వాటిని మన పూర్వీకులు భూమిలో దాచి ఉంచినవే కాలానుగుణంగా ఎప్పటికో కొన్ని దశాబ్దాల తర్వాత అవి బయట పడతాయి. వాటిలో పూర్వ కాలానికి సంబంధించిన కరెన్సీ కాయిన్స్, బంగారు ఆభరణాలు, వెండి కాయిన్స్ , ఆభరణాలు బయటపడతాయి. అలాగే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓ రైతు పొలంలో పని చేస్తుండగా నాలుగు లంకె బిందెలు బయటపడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో పొలంలో మట్టి తవ్వుతుండగా నాలుగు లంకె బిందెలు బయటపడ్డాయి. ఈ ఘటన పదిరోజుల క్రితం జరుగగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఆర్ఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ విక్రమ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. లంకె బిందెలు దొరికిన రైతును తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి పంచనామా చేశారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దొరికిన బిందెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత పది రోజుల క్రితం పిలాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నవీన్ తన పొలంలో భూమిని జేసీబీతో మట్టిని తవ్విస్తున్నాడు. మట్టి తవ్వుతుండగా నాలుగు లంకె బిందెలు బయటపడ్డాయి. జేసీబీ డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులు చూశారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వారికి డబ్బులు ఇస్తానని చెప్పి పంపించాడు. దీంతో వారు నాలుగైదు రోజులపాటు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత నవీన్ ఆ బిందెలను ఇంటికి తీసుకెళ్లాడు. డబ్బుల విషయమై నలుగురిలో మనస్పర్థలు వచ్చి ఆ డ్రైవర్లు గ్రామస్తులకు విషయం తెలియజేశారు. ఆ నోట ఈ నోట మాట బయటికి పొక్కడంతో స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వైరల్ అయింది. ఆ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు బాధితుడిని విచారించగా ఖాళీ బిందెలు మాత్రమే దొరికాయని అందులో ఏమీ లేవని చెప్పాడు. ఏమీ లేని బిందెలైతే విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.