వైద్యో నారయణో హరి అంటారు. అంటే.. చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు ఆ దేవుడితో సమానం అని చెబుతారు. కానీ, కొంతమంది నిర్లక్ష్యం వారు చేసే పనుల కారణంగా వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ప్రజల ప్రణాలుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. వైద్యురాలిగా ప్రసవం చేసి ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. మధ్యలో వదిలేసి వెళ్లిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కాన్పుచేసి తల్లీబిడ్డను కాపాడతారని నమ్మి వస్తే వాళ్లే పసికందు ప్రాణం తీశారని ఆవేదన వ్యక్తం చస్తున్నారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబం కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా ప్రసవం కోసం ఈనెల 16న జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఖలీఫాకి ఇది తొలి ప్రసవం. సాధారణ కాన్పు అయ్యేలాగే చూద్దామని వైద్యులు కూడా భరోసా కలిగించారు. ఆదివారం పురుటినొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద తన బృందంతో ప్రసవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్షయం వహించినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బిడ్డ పుట్టకముందే మధ్యలోనే వెళ్లిపోయారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వైద్యురాలు నర్మద నిర్లక్ష్యంగా వ్వహరించబట్టే బిడ్డ పురిటిలోనే మరణించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
అయితే వైద్యురాలు నర్మద వాదన మరోలా ఉంది. బిడ్డ కడుపులోనే ఉమ్మనీరు తాగినట్లు చెబుతున్నారు. బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది అని హెచ్చరించినా కూడా ఆపరేషన్ చేసేందుకు కుటుంబం అంగీకరించలేదని తెలిపారు. తానేమీ కాన్పు మధ్యలో వెళ్లిపోలేదని.. తన డ్యూటీ సమయం ముగిసిన తర్వాత కూడా ప్రసవం చేసేందుకు అక్కడే ఉన్నానని తెలిపారు. మధ్యలో వదిలేసి వెళ్లిపోయారనే వాదనలను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైద్యురాలి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలోనే ఇలాంటి ఘటనలోనే వైద్యురాలు నర్మద సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె నిర్లక్ష్యం వల్లే ఓ శిశువు మరణిస్తే అప్పటి కలెక్టర్ సస్పెండ్ చేశారని చెబుతున్నారు.