హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అనేది నిత్య కృత్యం. ఏవైనా ప్రత్యేక సందర్భాలు, నగరంలో ఏవైనా కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తే.. భద్రతా, రద్దీ కారణాల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఇక బుధవారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి హెచ్‌సీఏ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా.. మ్యాచ్ సందర్భంగా నేడు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
మ్యాచ్ నేపథ్యంలో.. సోమాజిగూడ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రూట్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మరీ ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు, మ్యాచ్ ముగిసే సమయంలో ఈ రూట్లలో వెళ్లకుండా.. ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.
అలానే హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ వాలాషన్ అలియాస్ ప్రిన్స్ ముకర్రంజా బహదూర్ అంత్యక్రియలు బుధవారం మక్కా మసీదులో నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఆయన కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున… మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో.. నేడు అదనపు సర్వీసులను నడపనుంది. అలానే నాగోల్ నుంచి రాయదుర్గం బ్లూ లైన్ కారిడార్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెట్రో ఫ్రీక్వెన్సీ 7 నిముషాల నుంచి 5 నిమిషాలకు కుదిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అంటే.. ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడుపుతారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది అన్నారు. అంతేకాకుండా.. రద్దీని బట్టి అదనంగా మరో రెండు మెట్రో రైళ్లను కూడా నాగోల్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
#HYDTPinfo
Commuters are requested to note the #TrafficAlert in view of one day cricket match b/w India & Newzealand on 18th January 2023 at Rajiv Gandhi International Cricket Stadium, Uppal. #TrafficAdvisory @AddlCPTrfHyd pic.twitter.com/xXJHbGhMIj— Hyderabad Traffic Police (@HYDTP) January 18, 2023