మరి కొద్ది రోజుల్లో.. 2022 సంవత్సరం పూర్తి అవుతుంది. కొత్త ఏడాది కొంగొత్తగా ప్రారంభం అవుతుంది. ఇక పాత సంవత్సరానికి ముగింపు పలికి.. కొత్త ఏడాదికి ఆహ్వానం పలకడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు జనాలు. ఇక గత కొన్నేళ్లుగా.. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం న్యూఇయర్ వేడుకులు రెడీ అవుతోంది. ఈఏడాది మరింత ఘనంగా సరికొత్తగా.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రత్యేక వేడుకల కోసం నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది.. మందు బాబుల గురించే. ఈ రోజు తప్పితే.. ఇక జీవితంలో మళ్లీ తాగం అన్నట్లు.. తెల్లవార్లు పీకలదాక తాగుతారు. అయితే న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చేందుకు నగర పోలీసులు రెడీ అవుతున్నారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కితే.. జేబుకు చిల్లే అంటున్నారు పోలీసులు. అంతేకాక జైలుకు కూడా వెళ్తారని హెచ్చరిస్తున్నారు. 31 నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. ఏకంగా 10 వేల రూపాయల ఫైన్ విధించడం లేక.. ఆరు నెలలు జైలు శిక్ష లేదా.. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. 31 నాడు.. మధ్యాహ్నం నుంచి తెల్లవారు జాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉంది. కనుక మందు బాబులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
పబ్బులు, బార్లలో జంటల కోసం నిర్వహించే వేడకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు. వేడుకల్లో డ్రగ్స్ సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని, వారు ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు తెలిపారు.
ఇక న్యూఇయర్ వేడుకల నిర్వహణ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్ పోలీసులు నిబంధలు కఠినతరం చేశారు. వేడుకలను రాత్రి ఒంటిగంట వరకూ నిర్వహించాలనుకునే 3 స్టార్, 5స్టార్ హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు.. దానికి సంబంధించి 10 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో లోపలికి, బయటకు వెళ్లే ప్రాంతాల్లో.. పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని.. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని పోలీసులు సూచించారు. అసభ్యకర నృత్యాలు, అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా నిర్వహాకులదేనని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు.