జాగ్రత్త అబ్బాయిలు..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. లేదంటే.. ఇలాంటి షాకులు మీరూ వినాల్సి వస్తుంది. ఏంటా షాక్..? ఎవరా వధువు..? ఈ కథనమేంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి మరీ..
వరకట్నం.. ఈ పిశాచి ఎందరి ప్రాణాలు బలి తీసుకుందో లెక్కెలేదు. ఆడపిల్ల పెళ్లి అంటేనే తల్లిదండ్రులకు గుండెల మీద కుంపటిలా భావించేవారు. వచ్చే అబ్బాయి ఎంత కట్నం అడుగుతాడో తెలియదు.. సరే అడిగినంత ఇచ్చినా ఊరుకుంటాడా.. తెలియదు.. అదనపు కట్నం కోసం మళ్లీ వేధింపులకు గురి చేస్తారా అని అడుగడుగునా భయం. ఒకరకంగా చెప్పాలంటే.. ఆడపిల్ల తరఫు వారు అంటే మగపెళ్లి వారికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చే యంత్రంలాంటిది అన్నమాట. నేటి ఆధునిక యుగంలో కూడా వరకట్న వేధింపులు ఆగడం లేదు. ఇంకా అక్కడక్కడ ఈ తరహా వేధింపులు చూస్తూనే ఉన్నాం. కాకపోతే.. కట్నం వద్దనే అబ్బాయిలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. కానీ, వీటన్నిటికీ విరుద్ధంగా హైదరాబాద్ నగర శివారులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని వధువు పెళ్లికి గంట ముందు వివాహాన్ని రద్దు చేసుకుంది. అప్పుడెప్పుడో వచ్చిన జంబ లకిడి బంబ సినిమాలోని ఓ సీన్ ను తలపిస్తున్న ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ జిల్లా, ఘట్‌కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
నగర శివారులోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. ఆ సమయంలో పెట్టిపోతల్లో భాగంగా వధువుకి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా మాటలు జరిగాయి. అన్నీ కుదరాక పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. శుభలేఖలు కొట్టించి బంధుమిత్రులను ఆహ్వానించారు. ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి 7.21 గంటలకు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. అంతకుముందే బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు వేదిక వద్దకు చేరుకోవడంతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. అయితే ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీయగా అటువైపు నుంచి షాకింగ్ విషయం వారి చెవిన పడింది.
తమ కుమార్తెకు కట్నం సరిపోలేదని వధువు తల్లిదండ్రులు ఫోన్ లో తెలిపారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా మరింత కట్నం కావాలని తమ కుమార్తె అంటోందని వారు తెలిపినట్లు సమాచారం. కట్నం తక్కువ కావడంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వధువు వారితో తేల్చి చెప్పిందట. ఈ వింత అనుభవంతో ఆశ్చర్యపోయిన వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్ కి పిలిపించి మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా వధువు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పోలీసుల సమక్షంలోనే వివాహం రద్దు చేసుకున్నారు. అయితే అప్పటికే వధువుకి ఇచ్చిన రూ.2 లక్షల నగదును సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకోవడం గమనార్హం. కాకుంటే.. పెళ్లి ఆగిపోవడాన్ని అవమానంగా భావించి వరుడు కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
చూశారుగా అబ్బాయిలు.. పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. కానీ, ఇలాంటి అనుభవాలను కొని తెచ్చుకోకండి. ఈ పెళ్లిపై.. ఈ వధువుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.