సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్ లో హిజ్రాలు హడావుడి చేస్తుంటారు.. తాము అడిగినంత డబ్బులు ఇస్తే దీవిస్తారు.. లేదంటే శపిస్తారు. కొన్నిసార్లు వాళ్లు చేసే ఆగడాలు శృతిమించిపోతుంటాయి.. దాంతో కొంతమంది వారిపై దాడులు జరుగుతుంటాయి.
సాధారణంగా వివాహాలు, పుట్టిన రోజు వేడుకలు ఇతర ఫంక్షన్స్ లో హిజ్రాలు సందడి చేస్తుంటారు. శుభకార్యాలు ఏం చేసినా అక్కడ హిజ్రాలు ప్రత్యక్షం కావడం.. వారు కోరినంత ఇచ్చే వరకు చప్పట్లు కొడుతూ ఉంటారు.. ఎంతో అంత వారి చేతిలో పెడితే దీవించి వెళ్లిపోతారు. అయితే హిజ్రాల దీవెనలు శుభకరమే అని సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకే శుభకార్యాలకు వచ్చినవారిని ఏమీ అనకుండా వారికి డబ్బు ఇచ్చి పంపుతుంటారు. కొంతమంది హిజ్రాలు రోడ్ సిగ్నల్స్ దగ్గర, థియేటర్స్, బస్టాండ్, ట్రైన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా కొంతమంది హిజ్రాలపై ఓ ఫంక్షన్ హాల్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటన కరీంనగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఎక్కువగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో హిజ్రాలు సందడి చేస్తున్నారు. తాము ఎంతో దూరం నుంచి వస్తుంటామని.. అడిగినంత డబ్బు ఇవ్వాలని వధూవరుల కుటుంబ సభ్యులను డిమాండ్ చేస్తుంటారు. కొంతమంది వారు అడిగినంత డబ్బు ఇచ్చి పంపుతుంటారు.. మరికొంత మంది వారి స్థాయికి తగ్గట్టు డబ్బు ఇచ్చి పంపుతారు. వెళ్లే ముందు అందరినీ దీవించి వెళ్తుంటారు.. కొంతమంది హిజ్రాలు డ్యాన్స్ చేసి ఎంటర్ టైన్ చేస్తుంటారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లో ఉన్నతి ఫంక్షన్ హాల్లో ఓ విడాహ వేడుక జరుగుతుంది. అక్కడికి కొంతమంది హిజ్రాలు వచ్చారు.
పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల నుంచి కొంత డబ్బు బహుమానంగా ఇవ్వాలని కోరారు. కానీ పెళ్లి కొడుకు బంధువులు హిజ్రాలు అడిగినంత డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. హిజ్రాలు చప్పట్లు కొడుతూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. దాంతో అక్కడికి ఫంక్షన్ హాల్ సిబ్బంది వచ్చి వాళ్లను వెళ్లిపొమన్నారు.. డబ్బులు ఇచ్చే వరకు తాము కదలం అనడంతో మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఫంక్షన్ హాల్ సిబ్బందితో పాటు మరికొందరు ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో హిజ్రాలపై దాడికి దిగారు. కాళ్లు మొక్కుతాం.. తమపై దాడి చేయొద్దు అన్నా వినిపించుకోలేదని ఓ హిజ్రా కన్నీటిపర్యంతం అయ్యింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎల్ఎండీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ హిజ్రాలను సమీప ఆసుపత్రికి తరలించారు. హిజ్రాల ఫిర్యాదు మేరకు ఫంక్షన్ హాల్ మేనేజర్, సిబ్బంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు. హిజ్రాలపై దాడి చేయడం అన్యాయం అని.. వారు డబ్బులు లేవని పంపించాలి.. కానీ ఇలా దాడులు చేయడం నేరం అని.. హిజ్రాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.