తెలంగాణ సర్కార్ పై మరోసారి హై కోర్టు సీరియస్ అయింది. వినాయకనిమజ్జనం ఆంక్షలపై తీర్పును తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ సీపీపై కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీ పై అసహనం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు.. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎంత ఘోరంగా చూపిస్తుందో ప్రభుత్వానికి తెలియదా.. మరి దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అయితే జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం.. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొంది.
అయితే ఇది మాటల వరకు మాత్రమే పరిమితమా..? సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హై కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నెల 10 నుంచి నగరంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది గణేష్ ఉత్సవాలు పెద్దగా జరుపుకోలేకపోయారు.. ఈసారి ఉత్సవాలు ఘనంగా జరిపుకోవాలని నగర వాసులు భావిస్తున్నారు.