తెలంగాణలో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికో ప్రీతి ఉదంతం గడవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రీతి మరణానికి కారణమైన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని సామాన్య జనం దగ్గరి నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గడవక ముందే తెలంగాణలో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం గోపాలపూర్లో విషాదం చోటుచేసుకుంది. పోగుల ఉషారాణి అనే స్టూడెంట్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కూతురి మృత దేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఉషా రాణి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రేమించి మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని ప్రాథమిక సమాచారం. అయితే.. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఉషారాణి మృతదేహాన్ని హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. కాగా.. రాష్ట్రంలో విద్యార్థినులు వరుసగా సూసైడ్లు చేసుకోవడం కలకలం రేపుతోంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అలాగే వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆత్మహత్యకు తొలుత ర్యాగింగ్ అని ప్రచారం జరిగినా.. దాన్ని కళాశాల యాజమాన్యం ఖండించింది.