సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, ఆకృత్యాలు ఇవన్నీ చూసి రగిలిపోయిన ఒక బాలుడి ఆవేదన నుంచి మొదలైన ప్రయాణమే ఈ గద్దర్ బయోగ్రఫీ. స్వేచ్ఛగా తిరుగుబాట కోసం తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రజాకవి గద్దర్ జీవిత విశేషాలు మీ కోసం.
ఒక మహా అధ్యాయం ముగిసిన రోజు ఈరోజు. ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జనాన్ని మేలుకొలిపి.. పోరాటం వైపు ఉసిగొల్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా కవి, గాయకుడు అయినటువంటి గద్దర్ ప్రత్యేక పాత్ర పోషించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1949లో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో దళిత కుటుంబంలో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో అవమానాలు ఎదుర్కున్నారు. అడుగడుగునా అవమానాలే. ఆ అవమానాలే ఆయనను ఒక విప్లవ కవిని చేశాయి.
బడిలో పాఠాలు నేర్చుకునే సమయంలోనే ఆయన విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. విద్యార్థి దశ నుంచే పోరాట భావాలను కలిగి ఉన్న గద్దర్.. తెలంగాణ వెనుకబాటుతనాన్ని, శిథిలమవుతున్న తెలంగాణ జీవన విధానాన్ని కళ్లారా చూశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే అన్నిటికీ పరిష్కారం అని భావిస్తూ వచ్చిన ఆయన.. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజల్ని చైతన్య పరచడం కోసం ఆయన బుర్రకథను సాధనంగా ఎంచుకున్నారు. ఊరూరా తిరుగుతూ ఉద్యమ భావ వ్యాప్తిని ప్రచారం చేసేవారు. ఒకరోజు గద్దర్ ప్రదర్శన చూసి సినీ దర్శకుడు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన చేసే అవకాశం ఇచ్చారు. గద్దర్ భగత్ సింగ్ జయంతి రోజున ప్రదర్శన ఇచ్చి నరసింగరావుని మెప్పించారు.
ఆయన ప్రోత్సాహంతో ప్రతి ఆదివారం బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చేవారు. బుర్ర కథల ద్వారా కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి పలు సామాజిక అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించేవారు. 1971లో గద్దర్ అనే ఆల్బమ్ కోసం ‘ఆపర రిక్షా’ పేరుతో ఒక పాట రాశారు. ఆ పాట అప్పట్లో ప్రతీ గొంతులోనూ ఆడింది. దీంతో విఠల్ రావు పేరు కాస్తా గద్దర్ గా మారింది. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా ఈ పేరును తీసుకోవడం జరిగింది. అలా తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్.. 1975లో బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు. కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరారు. ఆ తర్వాత విమల అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పిల్లలకు నామకరణం చేశారు.
అయితే ఆయన రెండవ కొడుకు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మరణించారు. ‘మా భూమి’ సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. ఇందులో ఆయనే స్వయంగా.. ‘బండెనక బండి కట్టి’ అనే పాటను పాడి ఆడారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన 85లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత దళితులను మేల్కొల్పేందుకు,వారిని చైతన్యపరిచేందుకు, పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించేందుకు జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతీ మనిషి గుండెల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రదర్శనలు ఇచ్చారు.
పాటలు, నాటకాల రూపంలో సమాజంలో ఉన్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించేవారు. ఈయన రాసిన పాటల్లో ‘అమ్మ తెలంగాణమా’ అనే పాట అత్యధిక ప్రజాదరణ పొందింది. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది. ఈయన రాసిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ’ పాటకి నంది అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. గద్దర్ రాసిన అనేక పాటలు సినిమాల్లో పెట్టుకున్నారు. విప్లవ నేపథ్యంలో ఆర్ నారాయణమూర్తి తీసిన అనేక సినిమాలకు గద్దర్ పాటలు రాశారు. 1980 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గద్దర్ పాటలే వినిపించేవి. అంతలా ఆయన పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు.
ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, గాయకుడిగా, ప్రజా నేతగా ఉన్న ఆయన నటుడిగా కూడా నటించారు. 1983లో వచ్చిన ‘రంగుల కల’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. 2011లో జగపతిబాబు హీరోగా వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన దండకారణ్యం సినిమాలో నటించారు. 2019లో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోనూ గద్దర్ నటించారు. గద్దర్ నటించిన చివరి సినిమా ఉక్కు సత్యాగ్రహం. అణచివేతకు వ్యతిరేకంగా పుట్టినదే నక్సలిజం అని నమ్మిన గద్దర్.. నక్సలైట్ల ఉద్యమం కోసం సానుకూలంగా పాటలు పాడేవారు. 2010 వరకూ నక్సలిజంలో కొనసాగిన ఆయన ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. 1997 ఏప్రిల్ 6న గుర్తు తెలియని వ్యక్తులు గద్దర్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయన మీద కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన ఒంట్లోకి ఆరు బుల్లెట్లు దిగాయి. అయితే 5 బుల్లెట్లను తొలగించిన వైద్యులు.. ఆరవ బుల్లెట్ ని తొలగించడం కుదరదని అన్నారు. అది తొలగిస్తే ప్రాణానికే ప్రమాదం అని అన్నారు. దీంతో ఆయన ఆ బుల్లెట్ ని శరీరంలోనే దాచుకున్నారు. గద్దర్ ను కేసీఆర్ ప్రజా యుద్ధ నౌక అని అనేవారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆయన కల నెరవేరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి కోరుకుందాం.