ప్రజల సమస్యల మీద పోరాటం చేయడమే కాదు.. నిరుపేద విద్యార్థుల కోసం పాఠశాలను కూడా నిర్మించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రజల గుండెల్లో ప్రజా నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
ప్రజా కవి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్ మరణవార్త తెలుగు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తన సాహిత్యంతో, గానంతో ప్రజలను చైతన్యం వైపు నడిపించి.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. సమస్య ఉన్న చోట వాలిపోయి పరిష్కారం దొరికేవరకూ పోరాడేవారు. పేద ప్రజలు, దళితుల కుత్తుకై వారి కష్టాలను ప్రపంచమంతా వినిపించారు. ప్రతి ఒక్కరిలోనూ తన పాటలతో తిరుగుబాటు జ్వాలను వెలిగించారు. గద్దర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలు పడ్డారు. ఒక్క పూట అన్నం తినడానికి, కాలేజీ ఫీజులు చెల్లించడానికి పనికి వెళ్లేవారు. పాఠశాలలో, కళాశాలలో అవమానాలు ఎదుర్కున్నారు.
అయినా గానీ తగ్గేదేలే అన్నట్టు శిఖరంలా ఎదుగుతూ వచ్చారు. అవమానించిన వారే అభిమానించే స్థాయికి ఎదిగారు. తనలా ఇంకెవరూ బాధపడకూడదని నిరంతరం ఆలోచించే గద్దర్.. పేద విద్యార్థుల కోసం ఒక పాఠశాలను కట్టించారు. నిరుపేద విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ లోని అల్వాల్ లో మహాబోధి పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నర్సరీ నుంచి పదో తరగతి వరకూ పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించారు. డబ్బులు లేక మధ్యలో చదువు ఆపేసే విద్యార్థులకు విద్యను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే గద్దర్ ఈ పాఠాశాలను ఏర్పాటై చేశారని మహాబోధి పాఠశాల సిబ్బంది వెల్లడించారు.
గద్దర్ మరణ వార్త తెలిసి మహాబోధి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. గద్దర్ ను కోల్పోవడం చాలా బాధాకరమని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని బాధపడుతున్నారు. గద్దర్ కి ఈ మహాబోధి పాఠశాల అంటే ఎంతో ఇష్టమని.. అందుకోసమే ఆయన అంత్యక్రియలు ఈ స్కూల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆసుపత్రి నుంచి ఎల్బీ స్టేడియంకు తరలించారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఉద్యమ సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, కళాకారులు గద్దర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
సోమవారం ఉదయం వరకూ ఆయన భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలోనే ఉంచి.. ఆ తర్వాత అంతిమయాత్ర చేపట్టనున్నారు. సికింద్రాబాద్ లోని అల్వాల్ లో ఉన్న ఆయనకు ఎంతో ఇష్టమైన మహాబోధి పాఠశాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహాబోధి పాఠశాలలోనే తన అంత్యక్రియలు జరగాలనేది గద్దర్ కోరిక అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరి నిరుపేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించి.. చదువు అందేలా చేసిన గద్దర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.