యాదాద్రి భువనగిరి జిల్లాలో కరెంటు బిల్లుతో ఓ దుకాణ యజమానికి షాక్ కొట్టింది. అదేంటీ కరెంటు ముట్టుకుంటే కదా షాక్ తగిలేదీ.. కానీ బిల్లు చూసి షాక్ తినడం ఏంటా అని అనుకుంటున్నారా.. ఆ బిల్లులో వచ్చిన మొత్తం చూస్తే ఎవరికైనా షాక్ కొట్టడం ఖాయం. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 6 లక్షల 46 వేల 360 రూపాయలు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో సొప్పరి రవి.. లేడీస్ ఎంపోరియం, గిఫ్ట్ కార్నర్ నడిపిస్తున్నాడు. ఇటీవల కరోనా నేపథ్యంలో చాలా వరకు బేరాలు తగ్గిపోయాయి.. రోజుకు మూడు, నాలుగు వందల గిరాకీ ఉంటుంది. నెలనెలా నాలుగైదు వందలు కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా….. 6 లక్షల 46 వేల 360 రూపాయలు రావడం చూసి దుకాణ యజమాని రవి షాక్‌కు గురయ్యాడు.
బిల్లు చూసి గుండె గుభేల్ మంది.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే భారీగా కరెంటు బిల్లు వచ్చిందని రవి అంటున్నారు. అధికారులు తన దుకాణ కరెంటు బిల్లును సరిచేసి ఇవ్వాలని కోరుతున్నాడు. మరి దీనిపై విద్యుత్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.