పెళ్లి మండపం లేదు. భాజా భజంత్రీలు లేవు. బంధువులు, అతిథులు లేరు. పెళ్లి మండపంలో జరగాల్సిన పెళ్లి, ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రే వివాహ వేదిక. ఐసీయూ గదే పెళ్లి మండపం. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులే పెళ్లి పెద్దలు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు మెడలో మూడు ముళ్ళు వేసి వివాహం చేసుకున్నాడు వరుడు.
భాజాభజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి.. చుట్టుపక్కలోళ్లు, చుట్టాలు, అతిథుల సమక్షంలో కలిసి ఏడడుగులు నడవాల్సిన జంట.. పెళ్లి మండపంలో జరగాల్సిన మూడు ముళ్ళ తంతు ఆసుపత్రి బెడ్ పై ఐసీయూలో జరిగింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. శస్త్రచికిత్స జరిగి ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న వధువుకు వరుడు తాళి కట్టాడు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలానికి చెందిన బానోత్ శైలజకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బసవరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. గురువారం లంబాడిపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే వధువు బుధవారం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వధువుని పరీక్షించిన వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో వధువుని ఐసీయూలో ఉంచారు. విషయం తెలుసుకున్న వరుడు తిరుపతి కంగారుపడ్డాడు. మరోవైపు ఇరు కుటుంబ సభ్యులు పేదవారు కావడంతో.. మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేయడం అంటే ఖర్చు ఎక్కువవుతుందని ఆలోచనలో పడ్డారు. దీంతో వరుడు తిరుపతి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అదే ముహూర్తానికి వధువుని పెళ్లి చేసుకున్నాడు. వైద్యుల అనుమతి తీసుకుని వధువు మెడలో వారి సమక్షంలోనే తాళి కట్టాడు.
వైద్యులే పెళ్లి పెద్దలుగా మారి వారి వివాహ తంతుని దగ్గరుండి జరిపించారు. వధూవరులిద్దరూ పూల దండలు మార్చుకుని ఒక ఇంటి వారయ్యారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిక మేరకు పెళ్ళికి అనుమతి ఇచ్చామని ఆసుపత్రి వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే మధ్యప్రదేశ్ కి చెందిన ఓ జంట ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్నారు. వధువుకి యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చేరితే వరుడు అక్కడే బెడ్ పైనే ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఇలా ఆసుపత్రి బెడ్ పైనే పెళ్లిళ్లు చేసుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు మంచిర్యాలలో ఒక యువకుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేసి ఆ ట్రెండ్ ని తెలుగులో పరిచయం చేశాడు. మరి ఆసుపత్రి బెడ్ ఒకటైన ఈ జంటపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.