తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రిలో పర్యటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతీయ పార్టీ ప్రకటించే ఆలోచన ఉన్న కేసీఆర్.. ఈలోపు తన ఇష్టదైవం యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం యాదాద్రి వచ్చారు. సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఒక కిలో 16 తులాల బంగారాన్ని కేసీఆర్ దంపతులు విరాళంగా సమర్పించారు. సీఎం కేసీఆర్ తో పాటుగా స్వామి వారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించడానికి మరికొందరు బంగారాన్ని విరాళంగా అందజేస్తారని యాదాద్రి ఈవో గీత తెలిపారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్.. యాదాద్రిలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దసరా రోజు కేసీఆర్ కీలక క్యాబినెట్ భేటీ నిర్వహించి జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లడం ఇది 21వ సారి కావడం గమనించవలసిన అంశం.